Sunday, April 28, 2024

పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపులు.. కొరవడిన ఔషధ నియంత్రణ అధికారుల నిఘా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర్రంలో మెడికల్‌ షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులు అధికంగా గ్రామీణ ప్రాంతాలలో కనీస నిబంధనలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మెడికల్‌ షాపుల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నది. నిబంధనల ప్రకారం…మెడికల్‌ షాపును నిర్వహించాలంటే సంబంధిత షాపు యజమాని బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పట్టభద్రుడై ఉండాలి. ఫార్మసిస్టుల ద్వారానే మందుల విక్రయం జరగాలి. షాపులో పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రిజ్‌, గ్లాసుతో కూడిన ర్యాకులో మందులు ఉంచాలి. రిజిస్టర్‌, బిల్‌ బుక్‌, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తీసేయాల్సి ఉంటుంది.

అలాగే, ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ ఇచ్చే శాంపిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదనే నిబంధనలు ఉన్నాయి. మందులు తయారీ గడువు ముగియడానికి ముందు వాటిని ఆరు నెలల ముందుగానే ప్రత్యేకంగా విడిగా ఉంచాలి. కొన్ని ప్రాంతాలలో తయారీ గడువు ముగియడానికి నెల రోజుల ముందు వరకు కూడా విక్రయిస్తున్న సంఘటనలు కొన్ని జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. ప్రజల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా యధేచ్చగా మందుల విక్రయాలు సాగిస్తున్నారు. అయితే, ఔషధ నియంత్రణ శాఖ అధికారుల నిఘా వైఫల్యం కారణంగా మెడికల్‌ షాపుల యజమానులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పట్టభద్రుల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని మందులపై ఏమాత్రం అవగాహన లేకుండానే విక్రయిస్తున్నారు.

మరికొంత మంది లైసెన్స్‌ లేనప్పటికీ యధేచ్చగా మందులను విక్రయిస్తున్న సంఘటనలు సైతం రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తరచూ మెడికల్‌ షాపులలో తనిఖీలు నిర్వహించాలి. అయితే, అధికారుల నిర్లక్ష్యం, తరచూ తనిఖీలు లేని కారణంగా మెడికల్‌ షాపుల యజమానులు నిబంధనలు ఉల్లంఘించి ప్రజారోగ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్కడా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే మెడికల్‌ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement