Sunday, March 24, 2024

ఐఫోన్‌ తయారీ దిశగా టాటా గ్రూప్‌.. విస్ట్రాన్‌ కొనుగోలుకు చర్చలు

దేశంలోనే యాపిల్‌ ఐఫోన్లు తయారు చేసేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం మన దేశంలో విదేశీ కంపెనీలు ఐఫోన్లను తయారు చేస్త్తున్నాయి. ప్రధానంగా ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌ వీటిని దేశీయంగా తయారు చేస్తున్నాయి. టాటా గ్రూప్‌ తొలి దేశీయ ఐఫోన్‌ తయారీ కంపెనీగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. బెంగళూర్‌కు సమీపంలో ఉన్న విస్ట్రాన్‌ ప్లాంట్‌ లో వాటాల కొనుగోలుకు టాటా గ్రూప్‌ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ కంపెనీలు మోజార్టీ వాటాలను తీసుకోవాలని టాటా ప్రయత్నిస్తోంది.

మార్చి నాటికి పూర్తి

విస్ట్రాన్‌ను తీసుకోవడం ద్వారా దేశంలోనేఐఫోన్ల తయారీని భారీగా చేపట్టాలని టాటా గ్రూప్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక యాపిల్‌ ఉత్పత్తుల రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను కూడా టాటా త్వరలో ప్రారంభించనుంది. ఎలక్ట్రానిక్స్‌లో చైనాతో పోటీ పడేందుకు విస్ట్రాన్‌ ప్లాంట్‌ ఉపయోగించుకోవాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి విస్ట్రాన్‌తో జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒప్పందం ఖరారు అయితే టాటా ఎలక్ట్రానిక్స్‌ పేరుతో భారీ స్థాయిలో ఐఫోన్‌తో పాటు, యాపిల్‌ ఇతర ఉత్పత్తుల తయారీని చేపట్టనుంది.

- Advertisement -

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, పెగట్రాన్‌ కంపెనీలు మన దేశంలో ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు విస్ట్రాన్‌ సర్వర్ల తయారీతో పాటు, ఇతర విభాగాల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌లో ఐఫోన్ల తయారీ బిజినెస్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. బెంగళూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రాన్‌ కంపెనీ ప్లాంట్‌ ఉంది. ఒప్పందం కుదిరితే ఈ ప్లాంట్‌లో ఉన్న ఐఫోన్‌ తయారీకి సంబంధించి 8 లైన్లు టాటా గ్రూప్‌ యాజమాన్యం కిందకు వస్తాయి. ఇక్కడ పని చేసే 10 వేల మంది కార్మికులు కూడా టాటా యాజమాన్యం కిందకు వస్తారు. టాటా గ్రూప్‌కు ఐఫోన్ల తయారీ యూనిట్‌ను విక్రయించినప్పటికీ, ఇండియాలో ఐఫోన్‌ సర్వీస్‌ భాగస్వామిగా విస్ట్రాన్‌ కొనసాగనుంది.

యాపిల్‌-టాటా బంధం

యాపిల్‌లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హోసూర్‌లో ఐఫోన్‌లో ఉపయోగించే పరికరాలను టాటా గ్రూప్‌ తయారు చేస్తోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో భారీగా కొత్త కార్మికులు, ఉద్యోగులను నియమిస్తోంది. ఇక్కడ కూడా ఐఫోన్ల తయారీని చేపట్టే అవకాశం ఉంది. యాపిల్‌ ఉత్పత్తుల విక్రయానికి టాటా త్వరలోనే దేశవ్యాప్తంగా 100 ప్రత్యేక స్టోర్స్‌ను ప్రారంభించనుంది. ఈ త్రైమాసికంలో ముంబైలో మొదటి స్టోర్‌ను ప్రారంభించనుంది.
యాపిల్‌ కంపెనీ కూడా ఐఫోన్ల తయారీ విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement