Thursday, April 25, 2024

Business: ఎయిర్‌టెల్‌లో పెరగనున్న మిట్టల్‌ వాటా.. సింగ్‌టెల్ సంస్థ‌తో కుదిరిన ఒప్పందం

భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ టెలికం కంపెనీలో తన వాటాను మరింత పెంచుకోనున్నారు. ఈ మేరకు సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న సింగ్‌టెల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌కు 3.3శాతం వాటా ఉంది. ఈ వాటాను సునీల్‌ మిట్టల్‌ సొంతం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా షేర్ల కొనుగోలు ఒప్పందం రూపంలో జరుగుతుంది. దీంతో కంపెనీలోమిట్టల్‌ కుటుంబ వాటా 24.13 శాతానికి చేరనుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ సుమారు రూ. 12,895 కోట్లు. ప్రమోటర్‌ సంస్థ భారతీ టెలికాం పేరుమీద ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. 90 రోజుల్లో ఈ వ్యవహారం పూర్తవుతుంది. సింగ్‌టెల్‌, భారతీ గ్రూప్‌ గత రెండు దశాబ్దాలుగా వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.

అయితే, సింగ్‌టెల్‌ తన వ్యాపార విస్తరణ, 5జీ అమలు కోసం మూలధన పెట్టుబడి అవసరాల కోసం కొన్ని సంస్థలనుంచి తన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటోందని సమాచారం. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్‌లో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన భారతీ టెలికంలో మిట్టల్‌ కుటుంబం (50.56 శాతం), సింగ్‌టెల్‌ (49.44శాతం) పెట్టుబడులతో సహ భాగస్వాములుగా ఉన్నాయి. అదనంగా ఎయిర్‌టెల్‌లో మిట్టల్‌ కుటుంబానికి నేరుగా 6.04 శాతం, సింగ్‌టెల్‌కు 13.8 శాతం వాటాలున్నాయి. తాజా ఒప్పందంతో ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ వాటా 29.7 శాతానికి చేరుతుంది. దీంట్లో 19.2 శాతం పరోక్షంగా భారతీ టెలికం ద్వారా, ప్రత్యక్షంగా ఎయిర్‌టెల్‌లో 10.5 శాతం వాటాలుంటాయని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.4.15 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement