Tuesday, April 30, 2024

కరుగుతున్న ఫారెక్స్‌ నిల్వలు.. అప్రమత్తమైన రిజర్వ్‌ బ్యాంక్‌

దేశ విదేశీమారక ద్రవ్యనిల్వలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో రిజర్య్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అప్రమత్తమైంది. రూపాయి విలువ మరింత పతనమవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో విదేశీమారక ద్రవ్య నిల్వలు 572.712 బిలియన్లుగా ఉంది. గడచిన వారం రోజుల్లో 7.5 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యం కరగిపోయినట్టయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో రూపాయి బలోపేతానికి ఆర్బీఐ చర్యలు ప్రారంభించింది. వర్షం పడుతున్నప్పుడు గొడుగు కొనుక్కోక తప్పదు కదా… అంటూ ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్యాపదేశంగా చేసిన హెచ్చరిక అందుకు సంకేతం. కాగా ఆర్‌బీఐ వారాంతపు గణాంకాల ప్రకారం జులై15 నాటికి విదేశీమారక ద్రవ్యం నిల్వ 572.712 బిలియన్‌ డాలర్లు. అంతకుముందు వారం 580.252 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్యం ఉండేది. గడచిన 20 నెలల్లో ఫారెక్స్‌ నిల్వల్లో ఇదే కనిష్ఠం. తాజా సమాచారం ప్రకారం గడచిన అక్టోబర్‌లో గరిష్టంగా 70 బిలియన్‌ డాలర్ల మొత్తం ఖర్చయిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో దాదాపు 30 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్యం నష్టపోయాం. కొన్నివారాలుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది.

ఎన్నడూ లేని రీతిలో డాలర్‌తో పోలిస్తే 80 రూపాయలకు పతనమైంది. ఈ ఏడాది మొదట్లో డాలర్‌కు రూపాయి విలువ 74గా ఉండేది. కాగా ఇప్పుడు బాగా బలహీనపడింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ దూకుడు విధానాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తకాంతదాస్‌ స్పందించారు. రూపాయి ఒడిదొడుకులకు లోనైనప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఫారెక్స్‌ మార్కెట్‌ తీరును గమనిస్తూ రూపాయి విలువను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా అభివృద్ధి చెందిన పెద్ద దేశాల కరెన్సీ విలువ పతనమవుతోందని, వాటితో పోలిస్తే రూపాయి బలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా రూపాయి విలువ పడిపోకుండా ఉండేందుకు కనీసం 100 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement