Friday, May 17, 2024

TS | కోడ్‌కు ముందే మెగా డీఎస్సీ.. విద్యాశాఖ కసరత్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇక ఉద్యోగాల జాతర రాబోతోంది. వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న పార్లమెంట్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతోందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈలోపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసి…ఎన్నికల బరిలోకి వెళ్లాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

ఈక్రమంలోనే ఈనెల చివరి లోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ వేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. మొత్తం 12500 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను జారీ చేసిన ప్రభుత్వం..లోక్‌ సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా వేయాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రూప్‌-1, మెగా డీస్సీ వేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇవ్వడంతో ఆ దిశగా కాంగ్రెస్‌ సర్కార్‌ వరుస నోటిఫికేషన్లను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటికి గతేడాదిలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ ఇంకా ఇంత వరకూ పరీక్ష నిర్వహించలేదు. పరీక్ష సన్నద్ధతకు తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో ఒకసారి పరీక్షను అప్పట్లో వాయిదా వేయగా, అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ గత ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

దీనికితోడూ ఉపాధ్యాయ పోస్టులు మరిన్ని పెంచాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో 5089 పోస్టులకు సుమారు మరో 7 వేల పోస్టులు అదనంగా కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. మరోవైపు అభ్యర్థులు కూడా మెగా డీఎస్సీని ఎన్నికల కోడ్‌కు ముందే వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement