Saturday, April 27, 2024

Big story | మూసీ జలరవాణాకు మాస్టర్‌ ప్లాన్‌.. కేంద్రంతో చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నది పరివాహక ప్రాంతాలు మానవ నాగరికతకు నిలయాలుగా అనేక ప్రాచీన నగరాలు ఆవిర్భవించాయి. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నాగరికత రాష్ట్ర నాగరికతగా నేటికి విరాజిల్లుతోంది. అయితే నదుల తీరాల్లో అవిర్భవించిన నగరాలు దినదినాభివృద్ధి చెందగా నదులు కాలుష్య సాగరాలై సవాళ్లను విసురుతున్నాయి. ఇందులో ప్రధానంగా అనేక రాజవంశాల నగరాలకు నిలయమై వేలాది సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో విరాజిల్లిన మూసి నదీ నాగరికత ప్రపంచలోని అనేక ప్రాచీన నాగరికతలకు సమానమై నిలిచింది.

అయితే పట్టణీకరణలో మూసీ మురికి కూపంగా మారడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూసిపునరుద్ధరణకు ప్రణాళికలు రచించి అమల్లోకి తీసుకువచ్చే బాధ్యతలను నీటిపారుదల, పర్యాటక తదితర రంగాలకు అప్పగించడంతో డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మూసీ మురికిని ప్రక్షాళనచేసి కాళేశ్వరం జలాలతో నింపి వాడపల్లి నుంచి కృష్ణా నదీ ద్వారా జలరవాణకు సిద్ధం చేయడం. అలాగే బాసర నుంచి గోదావరిలో జలరవాణ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుతున్నాయి.

తరతరాలుగా మూసీ జలరవాణా

- Advertisement -

మురుగుతో నిండిపోయిన మూసీ నది పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది.క్రీ.శ.610 నుంచి 642 వరకు దక్కన్‌ పాలించిన రెండవ పులకేశీ ఆర్యద్రావిడ యుద్ధంలో హర్షవర్ధనున్ని ఓడించి దక్కన్‌ ప్రాంతాన్ని సుస్థిరం చేయడానికి ప్రధానంగా ఆనాడు ముచికుందా(మూసీ) నది నుంచి జలరవాణా చేయడమే. ఆయుధాలను, సైనికులను మూసి నుంచి యుద్ధ ప్రాంతానికి తరలించి ద్రావిడులతో యుద్ధంచేసి దక్కన్‌ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశారు. నాటి నుంచి నేటి వరకు దక్కన్‌ పై ద్రావిడులు కన్నువేసినా ఫలితాలు సాధించలేకపోయారు. బాణుడు క్రీ.శ. 606నుంచి 647లో రచించిన హర్షచరిత్రలో రెండవ పులకేశీ యుద్ధ తంత్రాలు కూడా ఉన్నాయి.

అలాగే చరిత్రకు అందని, ఆధారాలు లభించని చరిత్ర ఎంతో ఉందని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ చెన్నారెడ్డి చెప్పారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తే మంచిరేవుల పల్లె హైదరాబాద్‌లో నేటికి ఉంది. ఈ రేవు పట్టణం మూసీ నదిదని చరిత్ర కారులు నిర్ధారించారు. అలాగే వాడపల్లిగా వ్యాప్తిలో ఉన్న ఒడపల్లి ఆనాటి ప్రధాన రేవుపట్టణం. వాడపల్లిలో మూసీ కృష్ణలో సంగమించి సముద్రం చేరుకుంటుంది. కాకతీయులు, అంతకు ముందు పరిపాలించిన రాజులు వాడపల్లి నుంచి సముద్రం ద్వారా విదేశీ వర్తకం చేసినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ రాసిన సియుకీ రచనల్లో జలరవాణాపై వివరాలున్నాయి. క్రీ.పూ. 230 నుంచి క్రీ.పూ. 450 వరకు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహనులు గోదావరి, మూసీ నుంచి జలరవాణా చేసినట్లు తెలుస్తుంది.

ప్రపంచంలోని అందమైన నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయి. థేమ్స్‌ నది ఒడ్డున లండన్‌, సెయిన్‌ నది ఒడ్డున ప్యారీస్‌, రెడ్‌ రివర్‌ ఒడ్డున వియత్నాం ప్రపంచంలో గుర్తింపు పొందినట్లుగానే మూసీ ఒడ్డున ఉన్న హైదరాబాద్‌ విశ్వనగరంగా విరాజిల్లినా మూసీ మురికి కూపంగా మారడం విచారకరం. ఈ సమస్యను అధిగమించేందుకు కాళేశ్వరం జలాలు మూసీని మురిపించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి 15 టీఎంసీల నీటిని గండిపేట, హిమాయత్‌ సాగర్‌కు తరలించేందుకు 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ నిర్మాణ జరుగుతోంది.

ఈ కాల్వ 27వ కిలోమీటర్‌ దగ్గర రావికోట్‌ చెరువుకు నీటిని తరలించి ఆచెరువు నుంచి మూసీ ప్రక్షాళనకోసం 5054క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. అలాగే సముద్రమట్టానికి 545 కిలోమీటర్ల ఎత్తులోని గండిపేట జలాశయానికి తరలిస్తారు. అనంతరం సముద్రమట్టానికి 537 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాయత్‌ సాగర్‌కు తరలిస్తారు. గోదావరినీరు మూసీ నుంచి వాడపల్లిలో కృష్ణా నదిలో సంగమించడంతో కృష్ణా గోదావరి నదులు అనుసంధానం ప్రక్రియకూడా పూర్తి అవుతోంది. ఈ ప్రక్రియకు సమాంతరంగా పర్యాటక శాఖ మూసీ నుంచి పడవప్రయాణం, జలరవాణాకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

బాసర నుంచి చెన్నై జలరవాణా

తరతరాల చరిత్రకు అద్దంపడుతూ ఊహలకే పరిమితమైన గోదావరి జలరవాణాకు అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి నదిని జలరవాణా పరిధిలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రతిపాదనలు కేంద్రపరిధిలో ఉన్నాయి. బాసర నుంచి చెన్నై వరకు జలరవాణా మార్గాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. బాసర, శ్రీరాంసాగర్‌, ధర్మపురి, రామగుండం, కాళేశ్వరం, ఏటూరినాగారం, భద్రాచలం, పోలవరం మీదుగా జలరవాణాకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అలాగే గోదావరి జలరవాణాను ఆంగ్లేయులు కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకు 796 కిలోమీటర్ల పొడవున నిర్మించిన బకింగ్‌ హామ్‌ కాలువకు అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement