Thursday, May 2, 2024

Big Story | కస్తూర్బా గాంధీ కాలేజీల పోస్టుల్లో కోత.. తెలుగు, ఇంగ్లీష్‌ లెక్చరర్ల పోస్టుల తొలగింపు

అమరావతి, ఆంధ్రప్రభ: అసలుకే అంతంతమాత్రంగా ఉన్న కస్తూరిభా గాంధీ కాలేజీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారనుంది. ఉన్న టీచర్లే సరిపోని పరిస్థితుల్లో ఉంటే వాటిల్లో కొన్నింటికి కోత పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 కస్తూరిభా గాంధీ కాలేజీల్లో అసలు తెలుగు లెక్చరర్ల పోస్టులే అసవరం లేదని కోత పెట్టారు. దీంతో దాదాపు 256 తెలుగు లెక్చరర్ల పోస్టులు ఎగిరిపోయాయి. అలాగే బైపిసి గ్రూపు ఉన్న చోట ఇంగ్లీష్‌ లెక్చరర్‌ కూడా అవసరం లేదని రాష్ట్ర సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజె క్ట్‌ డైరెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఈ పోస్టుల్లో ఉండి పార్ట్‌టైమ్‌ ప్రాతిపాదికన సేవలందించిన పీజీటీలను ఇంటికి పంపించేశారు. వీరి ప్లేస్‌లో కొత్త రిక్రూట్‌మెంట్‌ కూడా చేయడం లేదు. ఈ ఏడాది కస్తూరిభా గాంధీ కాలేజీల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ తెలుగు లెక్చరర్ల పోస్టులను జీరోగా చూపించారు. బైపిసి ఉన్న చోట ఇంగ్లీష్‌ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో తెలుగు, ఇంగ్లీష్‌ లెక్చరర్లు లేకుండా చదువు సాగడం ఎలా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కాలేజీలు కస్తూరిభా గాంధీ స్కూల్స్‌లోనే ఉంటాయి కాబట్టి స్కూల్‌లో చెప్పే టీచర్లే కాలేజీలకు చెబుతారని సమగ్ర శిక్ష అధికారులు అంటున్నారు. కానీ స్కూల్‌లో ఉండే ఒక టీచర్‌ పదో తరగతి వరకు పాఠాలు చెప్పేసరికే అలసిపోతారు. అటువంటిది ఇంటర్మీడియట్‌కూడా పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమౌతుందనేది ప్రశ్న.

రోడ్డున పడ్డ పిజిటీలు

2018లో కస్తూరిభా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ విద్యను కూడా ప్రవేశపెడుతూ నిర్ణయం తీసకున్నారు. అప్పటి నుండి 2022 లోపు 80 మంది తెలుగు పిజిటీ(పొస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌)లను, 70 మం ది ఇంగ్లీష్‌ పిజిటీలను పార్ట్‌టైమ్‌ పద్దతిని నియమించుకున్నారు. మొత్తం కాలేజీలకు దాదాపు 500 మంది పి జిటీల అవసరం ఉన్నప్పటికీ 150 మందిని మాత్రమే తీసుకొని మిగిలిన వారిని గెస్ట్‌ లెక్చరర్లుగా తీసుకున్నారు. ఈ ఏడాది నుండి తెలుగు, ఇంగ్లీస్‌ పోస్టుల్లో కోత పెడుతున్నామని చెప్పి ఈ 150 మంది ఇంటికి పంపించేశారు.

ఐదేళ్ల బట్టి వాళ్లు సర్వీసు చేసి ఇప్పుడు ఇంటికి పంపించడమేంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు నెలకు 12 వేల రూపాయల అరకొర జీతంతో పని చేశామని, ఎప్పటికైనా జీతం పెరుగుతుందని, ఉద్యోగ భద్రత ఉంటుందనే ఆశతోనే ఈ ఐదేళ్లు పనిచేశామని, ఇప్పుడు సడెన్‌గా ఇంటికి పంపిస్తే ఎలాగని వారు లబోదిబో మంటున్నారు. కాలేజీలకు పోస్టులు అసవరమనే ఉద్దేశ్యంతో నోటిఫికేషన్‌ ద్వారా తమకు రిక్రూట్‌చేశారని, ఇప్పుడు వేమంతా దొడ్డిదారిన అపాయింట్‌మెంట్‌ పొందామని సమగ్రశిక్ష అధికారులు అవ మానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అంతంతమాత్రంగానే విద్యా బోధన..

ఇప్పటికే కస్తూరిభా గాంధీ కాలేజీల్లో విద్యా బోధన అంతంత మాత్రంగానే ఉంది. పార్ట్‌టైమ్‌ లెక్చరర్లనైనా పూర్తిస్థాయిలో నియమించకుండా గెస్ట్‌ లెక్చరర్లతో చాలా చోట్ల బోధన పూర్తి చేస్తున్నారు. దీని కారణంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఇది ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాల్లోనూ కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 శాతానికి పైడా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత ఉండగా కస్తూరిభా గాంధీ కాలేజీల్లో 45 శాతానికి మించి ఉత్తీర్ణత లేదు. అంతేకాదు అన్ని కాలేజీల్లో సౌకర్యాల లేమీ తాండవిస్తోంది.

ఏ కాలేజీలోనూ కనీసం ల్యాబ్‌లు కూడా లేవు. అదనంగా ఇంటర్మీడియట్‌ క్లాసులు వచ్చినా కొత్తగా క్లాసురూమ్‌ల నిర్మాణం జరగలేదు. ఒక్కొ విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టిన కారణంగా మరో వంద మంది విద్యార్ధులు పెరిగినా వంటవాళ్లను మాత్రం పెంచలేదు. అంతేకాక నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను కూడా విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా పెంచలేదు. ఇన్ని సమస్యల మధ్య ఉన్న కస్తూరిభా గాంధీ కాలేజీల్లో టీచర్ల పోస్టుల కోత కారణంగా అంతంతమాత్రంగానే ఉన్న విద్యా బోధన మరింత అధ్వానం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement