Friday, May 17, 2024

Delhi | నిజాయితీపరులను జైలుకు పంపుతున్నారు.. చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీలో లోకేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సంపూర్ణ అధికారం అవినీతికి ఆస్కామిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం రాత్రి పార్టీ ఎంపీ కే. రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన, శుక్రవారం పలు జాతీయ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. సంపూర్ణ అధికారం అవినీతికి ఆస్కారమిస్తుందని, ఫలితంగా అవినీతిపరులు నిజాయితీపరులను జైలుకు పంపుతారని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఇదే జరిగిందని ఆయనన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మనీ ట్రయల్ నిరూపించలేకపోయిందని అన్నారు. అధికారాన్ని అంతా ఉపయోగించి చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని అన్నారు. జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో తప్పుడు కేసును సృష్టించిందని నిరూపించడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం – జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని వెల్లడించారు. శుక్రవారం జాతీయ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. సిద్ధార్థ్ లూథ్రా వంటి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌ను ఈ కేసు కోసం నియమించుకున్నప్పటికీ ఏసీబీ కోర్టులో ఇప్పటి వరకు ఎలాంటి ఊరట లభించలేదు. లూథ్రా కూడా నిర్వేదంతో చేసిన ట్వీట్లు చర్చకు దారితీశాయి.

- Advertisement -

ఈ పరిస్థితుల్లో ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులను కలిసి కేసు వివరాలను వారికి వివరించినట్టు తెలిసింది. సరైన ఆధారాలు లేకుండా, నిబంధనలు సరిగా పాటించకుండానే అరెస్టు చేసినట్టు వారికి చెప్పినట్టు సమాచారం. కేసు వివరాలను పూర్తిగా వారితో పంచుకుని, చంద్రాబాబు నాయుడును ఈ కేసును ఎలా బయటపడేయాలన్న అంశంపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే ఢిల్లీలోని తెలుగు మీడియాతో మాత్రం ఎలాంటి సమాచారాన్ని ఆయన పంచుకోలేదు.

శనివారం ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించి, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అంటూ జాతీయస్థాయిలో అందరికీ తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని, తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నది అందరికీ తెలియజెప్పాలని నారా లోకేశ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ దిశగా తన ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement