Wednesday, May 15, 2024

నిబంధ‌న‌ల మేర‌కే క‌ల్వ‌కుర్తికి నీళ్లు.. లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆయకట్టు పెంచలే..

పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంపోనెంట్లను ఒకటిగానే పరిగణించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఎత్తిపోతల పథకం కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని రెండు కాంపోనెంట్లుగా (1.14, 1.15) గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరచడాన్ని తప్పుబట్టింది. ఈ విషయ పై బోర్డు ఛైర్మన్‌ పిళ్లైకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ఆదివారం లేఖ రాశారు. ”గెజిట్‌ నోటిఫికేషన్‌లో కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం రెండో కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీల వరకు పెంచినట్లు చూపించారు. అది తప్పు. పథకం కింద పెంచిన ఆయకట్టుకు సరిపోయే నీటి కేటాయింపులనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కొత్తగా ఆయకట్టును పెంచలేదు. నాటి ఏపీ ప్రభుత్వం కల్వకుర్తి ఆయకట్టును 2.5లక్షల నుంచి 3.65లక్షల ఎకరాలకు పెంచింది. కానీ నీటి కేటాయింపులు ఆ మేరకు సరిపోయినంతగా పెంచలేదు. కొత్త సోర్స్‌ నుంచి నీటిని తీసుకోవడం లేదు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేట్లు 2006లోనే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట నివేదించిన డీపీఆర్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులైన జీఎన్‌ఎస్‌, వెలిగొండ, హెచ్‌ఎన్‌ ఎస్‌ఎస్‌, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట నివేదించాం. నాటి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఎల్‌ 885 అడుగుల సమీప మట్టం వద్ద నీటిని తీసుకునేట్టు డిజైన్‌ చేసింది” అని వివరించారు.

కల్వకుర్తి ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను లేఖకు జత చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కృష్ణా నది బేసిన్‌లోని ప్రాజెక్టే అయినందున 800అడుగల వద్ద నుంచి తీసుకునే విధంగా… బేసిన్‌ ఆవల ఉండడంతో ఏపీ ప్రాజెక్టులను ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం సెక్షన్‌-89 ప్రకారం కొనసాగుతున్న కేడబ్ల్యూ డీటీ-2 వద్ద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 75శాతం నికర జలాలను కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు కేటాయించాలని కోరింది.

ఆంధ్రప్రదేశ్‌ మాత్రం జీఎన్‌ ఎస్‌ఎస్‌, వెలిగొండ, హెచ్‌ఎన్‌ ఎస్‌ ఎస్‌ తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కోరింది. 75 శాతం నికర జలాలు కేటాయించాలని కోరలేదని లేఖలో బోర్డుకు ఈఎన్‌సీ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలను సవరించేందుకు చర్యలు తీసుకోవాలని, గెజిట్‌ నోటిఫికేషన్‌ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని (1.15) తొలగించేందుకు చర్యలు తీసు కోవాలని కేఆర్‌ఎంబీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement