Monday, April 29, 2024

Followup: జీవితకాలం అధ్యక్ష పదవి అప్రజాస్వామికం.. ఆరోపణలపై బహిరంగ ప్రకటన చేయాలి: సీఈసీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం పాటు అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారంటూ వచ్చిన వార్తలు, ఆరోపణలపై వివరణనిస్తూ బహిరంగ ప్రకటన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శాశ్వత అధ్యక్షుడిగా నియమించినట్టు తమ దృష్టికొచ్చిన వెంటనే స్పందన కోరుతూ జులై 19న కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్సార్సీపీకి లేఖ రాసింది. అదే నెల 22లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. పార్టీ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆగస్టు 1న రిమైండర్ పంపించింది.

దానిక్కూడా బదులివ్వకపోవడంతో ఆ పార్టీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘం భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తూ ఆగస్టు 18న మరోసారి నోటీసులు పంపించింది. దీనిపై అదే నెల 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమాధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించిన విషయాన్ని ధృవీకరించలేదని, అలాగని ఖండించలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ సమాధానంలో జులై 8, 9 తేదీల్లో పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మాత్రమే ప్రస్తావించింది.

సెప్టెంబర్ 11న వైఎస్సార్సీపీ సమర్పించిన మరికొన్ని పత్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 7న పార్టీ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేపట్టినట్టు పేర్కొంది. అదే జవాబులో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారన్న ఆరోపణలకు బదులిచ్చింది. ఈ అంశం మీడియాలో ప్రచురితమైందని, దానిపై తాము అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ సంస్థకైనా శాశ్వత ప్రాతిపదికన ఒక వ్యక్తిని అధ్యక్షుణ్ణి చేయడం లేదా ఆ మాదిరిగా సంకేతాలివ్వడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే నిర్ణీత వ్యవధిలో జరిగే ఎన్నికల ప్రక్రియను నిలిపేసే చర్యలు ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ ఆరోపణలను విస్పష్టంగా ఖండించనిపక్షంలో మీడియాలో ప్రచురితమైన రీతిలో ఇతర రాజకీయ వ్యవస్థల్లో గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అంతర్గత విచారణ వీలైనంత వేగంగా పూర్తిచేసి, మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ విస్పష్టంగా బహిరంగ ప్రకటన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తద్వారా గందరగోళానికి తెరదించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement