Thursday, March 28, 2024

Delhi: పార్టీ గుర్తింపు రద్దు కాలేదు.. అచేతనంగా ఉందని నోటీసులిచ్చారు: కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు కాలేదని ఆ పార్టీ అధినేత కే.ఏ పాల్ ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దయినట్టుగా ప్రచారం జరుగుతోందని, నిజానికి పార్టీ ఇనాక్టివ్ (అచేతనం)గా ఉందని నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులకు తాము వివరణ ఇవ్వడంతో పాటు ఈసీ కోరిన అన్ని పత్రాలను సమర్పిస్తామని వెల్లడించారు. అలాగే తన వాహనాలు సీజ్ చేశారని వస్తున్న వార్తలను సైతం ఆయన ఖండించారు.

తెలంగాణలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా 59 మంది నిరుద్యోగ యువకులకు పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఇప్పిస్తానని కేఏ పాల్ ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ప్రజాశాంతి పార్టీ అచేతనంగా ఉందంటూ.. ఆ పార్టీకి ఉమ్మడి పార్టీ గుర్తు సహా మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు హెలీకాప్టర్ గుర్తు కేటాయించాలని కేఏ పాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement