Wednesday, May 15, 2024

పల్లెకు పోదాం.. చలో..చలో..

  • సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనం
  • పల్లెబాట పట్టిన పట్టణవాసులు
  • కిటకిటలాడిన బస్టేషన్లు
  • ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు
  • రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు
  • పల్లెలకు అప్పుడే మొదలైన సంక్రాంతి శోభ..

మూడురోజులపాటు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ముఖ్యమైంది. పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు పయనమవుతున్నారు. పండుగ పూర్తయిన తర్వాత నాలుగైదు రోజులు అక్కడే ఉండి అందరితో హాయిగా నిర్వహించుకుంటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులు పల్లెల్లో పనులు లేక పట్టాణాల్లో వచ్చి నివాసముంటారు. వీరంతా పండుగలకు పల్లెబాట పడుతుంటారు. పండగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంక్రాంతి స్పెషల్‌ పేరుతో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మెదక్‌ రీజియన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పండుగకు వెలుతున్న ప్రయాణికులతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి.

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట పట్టణాల్లో జీవిస్తున్న వాళ్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ప్రధానంగా సంక్రాంతి పండుగను ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ప్రతి యేటా తమసొంత గ్రామాలకు వెళ్ళి అందరితో కలిసి ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఇందుకు గానే వారం రోజుల ముందే పయనమవుతారు. పండుగ పూర్తయిన తర్వాత నాలుగైదు రోజులు అక్కడే ఉండి అందరితో హాయీగా నిర్వహించుకుంటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉద్యోగ రిత్యా వచ్చి ఆంధ్ర వాసులు నివసిస్తున్నారు. అదేవిధంగా పల్లెల్లో పనులు లేక పట్టాణాల్లో వచ్చి స్థానిక జిల్లా వాసులు నివాసముంటారు. వీరంతా పండుగలకు పల్లెబాట పడుతుంటారు. దీంతో ప్రయాణికులను దృష్టిలోపెట్టుకుని టీఆర్‌ ఆర్టీసీ రెగ్యులర్‌ బస్సులతో పాటు అన్ని రూట్లలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. బోగీ పండుగ శనివారం ఉన్నది. పండుగకు రెండు రోజుల సమయమే ఉండడంతో పట్టణాల్లో జీవిస్తున్నవారు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పండుగకు వెలుతున్న ప్రయాణికులతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. ప్రయాణికులకు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను నిర్వహిస్తుంది. వృత్తి, జీవనోపాధి కోసం పల్లె వాసులు పట్టణాలకు వచ్చి నివసిస్తున్న వారు పండుగ వేళ ఇంటిల్లిపాది సొంతూళ్ళకు పయనమవుతున్నారు. పట్టణాల్లోని నలు మూలల్లో జీవిస్తున్న ప్రజలు సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఆయా బస్టాండ్లకు చేరుకోవడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. పండగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

సంక్రాంతికి స్పెషల్‌ బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, సంక్రాంతి పండుగా సందర్భంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ పేర్కొన్నారు. టీఆర్‌ ఆర్టీసీలో ప్రయాణికులకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, లింగంపల్లి నుండి మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వారి సొంత గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులకు అనుగుణంగా లింగంపల్లి నుండి జహీరాబాద్‌, మెదక్‌, నారాయణఖేడ్‌, పిట్లం, బిచుకుంద వెళ్ళే ప్రయాణికులకు ఆర్టిసీ మెదక్‌ రీజియన్‌ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 13వ తేదీ వరకు 150 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇప్పటికే 8వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. షెడ్యూల్‌ ఇలా ఉంది.. 08 జనవరిన 12 బస్సులు, 09న 21 బస్సులు, 10న 21 బస్సులు, 11న 29 బస్సులు, 12 న 32 బస్సులు, 13 న 33 బస్సులు నడుపుతున్నారు. ఇదే కాకుండా ట్రాఫిక్‌ రద్దీకు తదనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు సైతం టీఆర్‌ ఆర్టీసీ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అదనంగా 20 ప్రత్యేక బస్సులు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులు సంక్రాంతి పండుగకు వెళ్ళే వారి కోసం, తిరిగి రావడానికి ముందుగానే టిక్కెట్‌ బుక్‌ చేసుకొంటే తిరుగు ప్రయాణపు ఛార్జ్‌ పై 10శాతం రాయితి ఉంటుందని పేర్కొంది. మెదక్‌ ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో నైన అధికృత టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్‌ గా పని చేయడానికి ఆసక్తి కలిగిన వ్యక్తులు రీజినల్‌ మేనేజర్‌ని, ఆయా సంబంధిత డిపో మేనేజర్‌ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement