Wednesday, May 1, 2024

అణచివేతపై పిడికిలి బిగిద్దాం.. పౌరుషంతో ప్రజా ఉద్యమం నిర్మిద్దాం : తరుణ్ చుగ్

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ, అణిచివేత, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ప్రకటించారు. మంగళవారం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన సందర్భంగా తరుణ్ చుగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అణచివేతకు, దమనకాండ, దురాగతాలకు వ్యతిరేకంగా నడ్డా పౌరుషంతో కవాతు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బండి సంజయ్ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ జేపీ నడ్డా నిర్వహించే కవాతు ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. నిరంకుశత్వం, అహంకారం, అప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చుగ్ విమర్శించారు.


ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు, విద్యార్థులు, కార్మికులు అనే తేడా లేకుండా సమాజంలోని ప్రతి వర్గం ధర్నాలు, ఆందోళనలు చేస్తూ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని అన్నారు. పేరుమోసిన నేరస్థుణ్ణి లాక్కెళ్లినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్‌ పట్ల పోలీసులు వ్యవహరించారని, లాఠీలు, జల ఫిరంగులు ప్రయోగంతో పాటు గ్యాస్ కట్టర్లను వినియోగించి ఎంపీ కార్యాలయంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం, శ్రేణులు కదంతొక్కుతాయని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement