Monday, May 6, 2024

లాసెట్‌, ఎడ్‌ సెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ దరఖాస్తుల గడువును పొడిగించారు. లాసెట్‌ గడువును ఈనెల 29 వరకు, ఎడ్‌సెట్‌ గడువును ఈనెల 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశంగా లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మీ ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకొని తమకు దగ్గర్లోని సెంటర్‌ను ఎంచుకోవాలని సూచించారు. ఓపెన్‌ అభ్యర్థులకు రూ.900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్‌ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పిచారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో బీఎడ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌ దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును ఏప్రిల్‌ 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌ సెట్‌ కన్వీనర్‌ ఏ.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30వ తేదీన దరఖాస్తులను ఎడిట్‌ చసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎడ్‌సెట్‌ను మే 18న నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌ను గతంలో ఓయూ నిర్వహించింది. ఈ ఏడాది మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement