Saturday, May 4, 2024

Exclusive | దంచికొడుతున్న వానలు.. కొండచరియలు విరిగిపడడంతో మనాలి రోడ్లు క్లోజ్​!

హిమాచల్​ ప్రదేశ్​లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్ద పెద్ద కొండ చరియలు విరిగిపడడంతో పలు రహదారులను మూసివేశారు. దీంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న (శనివారం) రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

నది వెంబడి భారీగా కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై మండి, కులు మధ్య ట్రాఫిక్ నిలిచిపోయిందని పోలీసులు తెలిపారు. మండి జిల్లాలోని పండోహ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. ప్రభావిత ప్రాంతానికి ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు మండి దాటి కులు వైపు, కులు నుండి మండి వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కులు-మనాలి సెగ్మెంట్‌కు జీవనాధారమైన హైవే మూసివేయడంతో పాలు, బ్రెడ్, వార్తాపత్రికలు.. ఇతర గృహోపకరణాల సరఫరాపై ప్రభావం పడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి నుండి కమద్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో కతౌలా మీదుగా మండి, కులు మధ్య ప్రత్యామ్నాయ రహదారి లింక్ కూడా దెబ్బతిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

- Advertisement -

సిమ్లా, సిర్మౌర్, మండి, కాంగ్రా, కులు జిల్లాల అంతర్భాగాల్లో లింక్ రోడ్డు మూసివేశారు. దీంతో ట్రాఫిక్ కదలికలకు అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా హిమాచల్​ రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సోలన్ టౌన్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా పాక్షికంగా నిలిచిపోయింది. చురుకైన పశ్చిమ గాలుల ప్రభావంతో చంబా, కాంగ్రా, కులు, మండి, ఉనా, హమీర్‌పూర్, బిలాస్‌పూర్ జిల్లాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కిన్నౌర్, సిమ్లా, కులు, మండి, బిలాస్‌పూర్, సిర్మౌర్ జిల్లాల్లో సట్లూజ్, బియాస్.. యమునా నదులు.. వాటి ఉపనదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement