Thursday, May 2, 2024

KTR 60 ఏళ్ల విధ్వంస రాష్ట్రాన్ని ప‌దేళ్ళ‌లోనే దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేశాం

హైద‌రాబాద్ ….సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణలో జీవన విధ్వంసానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మ‌ళ్లీ అదే తీరులో అసెంబ్లీలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు.

అయినా మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీశ్‌రావు తాను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనపై ’ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ప్రేమ్‌ అమన్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆయన తెలంగాణ స్థితి గతులను అధ్యయనం చేస్తూ ఆ నాడు డాక్యుమెంటరీని తయారు చేశారు. కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతం.. పోలీసుల కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటు లేదు. ఉద్యోగాలు రావు. ఉద్దేశపూర్వక.. నేరపూరిత నిర్లక్ష్యంతో ఆ నాటి పాలకులు ఎటు చూసినా క్షమించలేని, క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేళాలకు తరలించే పరిస్థితి’ ఉండేదని గుర్తు చేశారు..

సమైక్య పాలకులకు తొత్తులుగా టీ కాంగ్రెస్‌ నేతలు..
‘వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్‌ సమైక్య పాలకులు డూడూ బసవన్నల మాదిరిగా వాళ్లు ఏం చెబితే దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువులపై నిర్లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలకు ఆయువుపట్టులాంటి చిన్ననాటి వనరులకు తీవ్ర అన్యాయం జరిగింది. గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్కబోర్ల పడ్డది వ్యవసాయం. చివరకు 54 బోర్లు వేసి రాంరెడ్డి ఆయన పేరు నల్లగొండ జిల్లాలో బోర్ల రాంరెడ్డిగా పేర్లుపడ్డ పరిస్థితి.

- Advertisement -

హైదరాబాద్‌ మినహా అన్నీ వెనుకబడిన జిల్లాలే..

‘మహబూబ్‌నగర్‌ జిల్లా భారతదేశంలోనే వెనుకబడిన జిల్లా. వెనుకబడిన జిల్లాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నయ్‌ అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా ఒకటి. పాలమూరు జిల్లా నుంచి 14లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు వెళ్లే దుస్థితి. వేల సంఖ్యలో ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. ఇవన్నీ యావత్‌ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు….

ఫ్లోరోసిస్ విషంలో న‌ల్గొండ జ‌న జీవ‌నం ..
‘నల్లగొండలో జలసాధన పోరాటం చేసిన జలసాధన పోరాటం చేసిన సత్యనారాయణ ప్రధానమంత్రి వాజ్‌పేయి టేబుల్‌పై అంశాల స్వామిని పడుకోబెట్టి పరిస్థితిని వివరించినా ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కారం కాని దైన్యం. ఒక్క నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ దెబ్బకు 2లక్షల మంది చివరకు వలసపోయే దుస్థితి. మానవ రహిత జిల్లాగా, మానవ రహిత ప్రాంతంగా ఆఖరికి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చివరకు చెప్పే దుస్థితి ఆ నాటి తెలంగాణకు వచ్చింది అంటూ గుర్తు చేశారు కెటిఆర్ .

స‌మైక్య పాల‌న‌లో తొత్తులుగా కాంగ్రెస్ నేత‌లు

1969 ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమం విఫలమైన తర్వాత 32 ఏళ్లు పట్టించుకోని పరిస్థితి. ఎవరూ లేరని సమైక్య పాలకులు చెలరేగి పోయిన సమైక్యవాదులు.. వారికి తొత్తులుగా కాంగ్రెస్‌ నాయకులున్నారు. చివరకు ఏమైంది పరిస్థితి అయ్యిందంటే.. ‘నానాటికి తీసికట్టు.. నాగంబొట్టు’ అన్నట్లుగా పరిస్థితి. ఈ రంగం ఆరంగం కాదు.. అన్నిరంగాల్లో తీరని వివక్ష, అన్యాయం తెలంగాణకు జరిగింది. నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డ లేడు.. గుండెలు పగలని తెలంగాణ గడప లేదంటే అతిశయోక్తి కాదు’ అన్నారు.

అప్పు కేవలం 3 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే..

అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మాకు మాట్లాడే అవకాశమివ్వకపోయినా మేం ఇచ్చిన సమాధానాలకు ప్రభుత్వం పారిపోయింది. బీఆర్‌ఎస్‌ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వ శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. తొమ్మిదేళ్లలో రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపాం. విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

60 ఏళ్ల గోస‌ను ప‌దేళ్ల‌లో అంతం చేశాం..

60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ నాయకులు మరొకసారి శ్వేతపత్రాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంటు,వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేశాం.రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాం. దీని ఫలితంగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం డబుల్‌ అయిందని’అని కేటీఆర్‌ వివరించారు.

ప్రతి రంగ‌లోనూ ప్ర‌గ‌తి ప‌రుగులే..

విద్యుత్‌, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, చెమటోడ్చి సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. కాలువలు కడితే 200 టీఎంసీల నీళ్లు పొలాల్లో పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement