Tuesday, May 21, 2024

Delhi | కృష్ణాజలాలు సగం సగం పంచాల్సిందే.. షెకావత్‌ను కోరిన మంత్రి హరీష్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కృష్ణాజలాల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాటాల లెక్కలు తేలేవరకు 50:50 నిష్పత్తిలో చెరో సగం పంచాలని తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన సమావేశం అనంతరం రాత్రి గం. 7.15 సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. నీటిపారుదల శాఖకు చెందిన పలు ప్రాజెక్టులు, అంశాలపై ఆయనకు వినతి పత్రాలు అందజేశారు.

అందులో ప్రధానంగా కృష్ణా జలాల వాటా గురించి చర్చించారు. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందని, రెండేళ్లు దాటినా సరే ఆ నిర్ణయం అమలు కాలేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. వాటాలు తేల్చేలోగా కృష్ణానదీ జలాలను చెరి సగం పంచుకుని వాడుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

- Advertisement -

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. దాంతో పాటు సీతారామ లిఫ్ట్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, డా. బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టులకు కూడా అనుమతులు మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు సెంట్రల్ వాటర్ కమిషన్ స్క్రూటినీలో ఉన్నాయని తెలిపారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి డీపీఆర్ సహా అన్ని పత్రాలను కూడా సమర్పించామని, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఫ్లోరైడ్ ప్రభావిత 1,226 గ్రామాలతో పాటు 6 జిల్లాల్లోని 12.36 లక్షల ఎకరాల ఆయకట్టు లబ్ది పొందుతుందని తెలిపారు.

పోలవరం విస్తరణతో తెలంగాణకు నష్టం

ఆమోదం లేకుండా పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. వరదనీటిని ఉపయోగించుకునే పేరుతో ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ కాంపోనెంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విస్తరిస్తోందని తెలిపారు. పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువలను కూడా విస్తరించారని, తద్వారా ప్రతిపాదిత మొత్తం కంటే రెండింతలు, మూడింతలు ఎక్కువ నీటిని కాలువల ద్వారా తరలించే వెసులుబాటు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులతో పాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోదావరి-పెన్నా లింక్ వంటి ప్రాజెక్టులను చేపట్టిందని హరీష్ రావు కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement