Sunday, May 5, 2024

అంతా అమెరికావల్లే : ఉత్తర కొరియా..

ఉక్రెయిన్‌పై రష్యా వ్యవహారంలో ప్రపంచదేశాలు, ప్రత్యేకించి పశ్చిమ దేశాలు పుతిన్‌పై మండిపడుతూంటే ఉ.కొరియా మాత్రం అమెరికానే తప్పుపట్టింది. అసలు ఈ యుద్ధానికి మూలకారణం అమెరికాయేనని ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో తొలిసారిగా స్పందించిన ఉత్తర కొరియా, విదేశాంగశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ విశ్లేషాత్మక వ్యాఖ్యను పోస్ట్‌ చేసింది. ప్రపంచంలో సైనికపరంగా ఆధిపత్యపు అభిజాత్యంతో అమెరికా వ్యవహరించడంవల్లే సంక్షోభం ఏర్పడిందని, రష్యా ఆత్మరక్షణ కోసం దాడి చేయకతప్పని స్థితిని అమెరికా కల్పించిందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కొరియాలోని సొసైటీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌ స్టడీ అనే సంస్థకు చెందిన రి జి సాంగ్‌ అనే పరిశోథకుడి పేరుతో ఈ విశ్లేషణను పోస్ట్‌ చేశారు.

అటు ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు.. ఇటు మరోసారి క్షిపణి ప్రయోగం..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం పట్టించుకోకుండా తన మానాన తను వ్యవహరిస్తోంది. అమెరికాకు చిర్రెత్తేలా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం ఆదివారంనాడు నిర్వహించిందని దక్షిణ కొరియా, జపాన్‌ ధ్రువీకరించాయి. జనవరిలో పదేపదే క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ప్యాంగ్‌యాంగ్‌ నెలరోజుల తరువాత మళ్లిd ఇప్పుడు మరోసారి క్షిపణిని పరీక్షించింది. ప్యాంగ్‌యాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని తూర్పుతీర ప్రాంతం సునన్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు సియోల్‌ పేర్కొంది. జనవరి 16న ఇక్కడినుంచే స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. కాగా ఆదివారంనాడు గరిష్టంగా 620 కి.మి. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. జపాన్‌, ద.కొరియా సహా ఈ ప్రాంతం భద్రతకు ఉ.కొరియా సవాలు విసురుతోందని జపాన్‌ రక్షణ మంత్రి నొబూ కిషి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజానికి ఉ.కొరియా దుందుడుకు వైఖరి ఆందోళనకలిగిస్తోందని తప్పుపట్టిన అమెరికా, ఈ క్షిపణులవల్ల తక్షణ ప్రమాదం ఉండదని అమెరికా వ్యాఖ్యానించింది. జనవరి 30 చివరిసారిగా హాసాంగ్‌ -12 దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ మిసైల్‌ను ఉ.కొరియా ప్రయోగించింది. ద.కొరియాలో మార్చి 9న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాయాది ఉ.కొరియా ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ఉ.కొరియా వైఖరి విచారకరంగా ఉందని ద.కొరియా వ్యాఖ్యానించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement