Friday, May 3, 2024

Delhi: మోడ్ర‌న్ ఆర్ట్స్‌లో పెయింటింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావే గ్రేట్ మాస్టర్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్స్ ఆర్ట్స్ లో ప్రఖ్యాత చిత్రకారుడు అక్బర్ సాహెబ్ గీసిన పెయింటింగ్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. డబ్బు ఎరజూపి పార్టీలో చేర్చుకునే నీచ సంస్కృతి బీజేపీలో లేదని, అలాంటి వ్యవహారాల్లో కేసీఆర్ అందెవేసిన చేయి అన్నారు.

కేసీఆర్ తొలి ప్రభుత్వంలో బీఎస్పీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే చేర్చుకుని, ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని, కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నలుగురు ఎమ్మెల్యేలకు తలా రూ. 100 కోట్లు ఇస్తామన్నట్టుగా చెప్పారని, కానీ ఒక్క పైసా కూడా చూపలేకపోయారని అన్నారు. అయినా ఆ నలుగురూ రూ. 400 కోట్లు పెట్టి కొనాల్సినంత విలువైన వ్యక్తులా అని ప్రశ్నించారు. “నలుగురు పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదు.. బీజేపీ అధికారంలోకి రాదు. తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది బీజేపీనే” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహిస్తారన్న అంశంపై స్పందిస్తూ.. “ఆయన ఢిల్లీలో కాకపోతే లండన్‌లో, లేదంటే న్యూయార్క్‌లో పెట్టుకోమనండి. పక్కనున్న పాకిస్తాన్ లాహోర్లో పెట్టుకోమనండి. మాకేం ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ప్రోత్సహించిన అడ్డగోలు పార్టీ ఫిరాయింపులపై మేమే ప్రెస్ మీట్ పెడతాం. మా పార్టీ నేతలకు నేరుగా కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు” అని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి సినిమాలు తీసి కేసీఆర్ ఇప్పటి వరకు విజయం సాధించి ఉండొచ్చని, కానీ బీజేపీని పాత్రధారిని చేస్తూ కేసీఆర్ తీసే సినిమాలు విజయవంతం కావని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement