Sunday, April 28, 2024

కేదార్‌నాథ్‌ ఆలయానికి బంగారు తాపడం వద్దు.. సంప్రదాయానికి విరుద్ధమన్న అర్చ‌కులు

కేదార్‌నాథ్‌ దేవాలయం గర్భగుడిలో గోడలకు బంగారు పూత పూయాలన్న నిర్ణయాన్ని కొందరు అర్చకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యతో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయానికి గండిపడుతుందని హెచ్చరిస్తున్నారు. బంగారు పూత పూయడం కోసం ఉపయోగించే భారీ డ్రిల్లింగ్‌ యంత్రాల వల్ల దేవాలయం దెబ్బతింటుందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ శివ భక్తుడు కేదార్‌నాథ్‌ దేవాలయానికి బంగారు పూత పూయించడానికి ముందుకు వచ్చారు. ఆయన ప్రతిపాదనను దేవాలయాల కమిటీ అంగీకరించింది.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో దేవాలయం గోడలకు తాపడం చేసిన వెండి రేకులను తొలగించి, బంగారు రేకులను తాపడం చేయాలని నిర్ణయించడాన్ని పురోహితులు వ్యతిరేకిస్తున్నారు. తీర్థ పురో#హతుడు సంతోష్‌ త్రివేది మాట్లాడుతూ, బంగారు రేకుల తాపడం వల్ల దేవాలయం గోడలు దెబ్బతింటాయన్నారు. ఈ పనుల కోసం పెద్ద పెద్ద డ్రిల్లింగ్‌ మెషీన్స్‌ను వాడుతున్నారన్నారు. దేవాలయంలో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని తారుమారు చేయడాన్ని తాము సహించలేమన్నారు.

కాగా, సీనియర్‌ అర్చకులు దీనిని సమర్థిస్తున్నారు. బదరీనాథ్‌-కేదార్‌నాథ్‌ దేవాలయాల కమిటీ అధ్యక్షుడు అజేంద్ర మాట్లాడుతూ బంగారు పూతను వ్యతిరేకించడం సమర్థనీయం కాదన్నారు. నిర్మాణానికి విఘాతం కలగకుండా, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. కేదార్‌ సభ మాజీ అధ్యక్షుడు మహేశ్‌, సీనియర్‌ అర్చకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఈ దేవాలయం సనాతన ధర్మానికి ప్రధాన కేంద్రమని చెప్పారు. దీనికి బంగారు రేకులను అమర్చే ప్రక్రియను హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement