Friday, May 3, 2024

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల ఉక్కు బాట‌….

త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అవకాశం
విశాఖ ఉక్కుతోపాటు మరో రెండు అంశాలు

అమరావతి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రధానంగా తెలుగు ప్రజల ఆత్మ బలిదానాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మొండిగా ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిన అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏపీతో సంబంధం లేకపోయినా అక్కడి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విశాఖ ఉక్కుకు తన సంఘీభావాన్ని తెలియజేసిన సంగతి పాఠక విదితమే. అంతేకాకుండా ఇలా చూస్తూ ఊరుకుంటే రేపు సింగరేణిని కూడా ప్రైవేటికరిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, విశ్లేషకులను ఆలోచింపజేశాయి. ఈనేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అంశం రాజకీయ వేడిని రగిల్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో కేటీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈనేపథ్యంలో ప్రైవేటీకరణపై ఇరు రాష్ట్రాలు గట్టిగా పోరాటాన్ని చేయాలనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలో
భేటీ అయ్యేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ భేటీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ముహూర్తం ఖరాయ్యే అవకాశాలు న్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విశాఖ ఉక్కుతోపాటు మరో రెండు అంశాలపైనా
ఈ భేటీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంతోపాటు మరో రెండు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల పరిధిలో జీవ నదులుగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ప్రక్రియకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలు దఫాలుగా ఇద్దరి మధ్య చర్చలు జరిపినప్పటికీ అవి తుది రూపానికి రాలేదు. అయితే, ఈసారి మరింత లోతుగా అధ్యయనం చేసేలా ఈ భేటీలో చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోతిరెడ్డిపాడు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇరు రాష్ట్రాల రైతుల కష్టాలను తీర్చే విధంగా ఈసారి చర్చలు జరిగే అవకాశముందని, ఇప్పటికే ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
పార్లమెంటులో తెలుగు ఎంపీలకు
అవకాశం లేకపోవడంపైనా
ఇటీల జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకు మాట్లాడేందుకు కూడా అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో చట్ట సభల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నోరు నొక్కేవిధంగా వ్యవహరించిన తీరుపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఐక్యత లోపిస్తే భవిష్యత్తులోనూ ఇటువంటి సంఘటనలే పునరావృతం అయ్యే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో కలసికట్టుగా అవగాహనతో ముందుకు సాగితే ఇటువంటి పరిస్థితులనుండి బయటపడే అవకాశముంటుందని వారు భావిస్తున్నట్లుగా సమాచారం.
విభజన అంశాలు, నిధుల సమీకరణ
జమ్ము కాష్మీర్‌కు ప్రత్యేక హోదా ప్రకటించిన నేపథ్యంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు హోదా అడిగే అంశంపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఐకత్య ఉంటే హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఎంపీలను మాట్లాడించేందుకు అవకాశం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఉండేవే కాదన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల మనోభావంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఈ రెండుమూడు అంశాలే కాకుండా ప్రతి అంశంలోనూ ఇరు రాష్ట్రాలు కలిసి ఒకే మాట, ఒకే బాట అన్నట్లుగా ఉంటే ప్రతి అంశాన్ని సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది రాజకీయ వర్గాల ఆలోచనగా ఉంది. ఈనేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రధాన్యతను సంతరించుకోబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement