Sunday, June 23, 2024

Delhi | రేపు మళ్లీ ఈడీ ముందుకు కవిత..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం గం. 10.30 నుంచి రాత్రి గం. 9.10 వరకు ప్రశ్నించారు. సాయంత్రం నుంచి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఒక దశలో కవితను అరెస్టు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమ భరత్ కుమార్ సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకోవడం, కాసేపటికే మహిళా వైద్యురాలితో కూడిన వైద్య బృందం కూడా అక్కడికి రావడంతో అరెస్టు ప్రక్రియలో భాగంగానే ఈ హడావుడి అనుకున్నారు.

అయితే సోమవారం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో  పాటు పశ్చిమ బెంగాల్ నుంచి జరుగుతున్న పశువుల స్మగ్లింగ్ కేసు విచారణ కూడా జరిగింది. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీశ్ సిసోడియా, పశువుల స్మగ్లింగ్ కేసులో అనుభ్రత మోండల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న నిందితులకు నిర్వహించాల్సిన వైద్య పరీక్షల కోసం వైద్య బృందాన్ని పిలిపించారని తర్వాత తెలిసింది. అయినప్పటికీ సమయం గడుస్తున్నా కవిత బయటికొస్తారో లేదో తెలియక బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా, ఉద్విగ్నంగా ఎదురుచూశారు. చివరకు రాత్రి గం. 9.10 సమయంలో కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చారు. బయటికొచ్చిన కవిత వాహనానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడి, అప్పటికే సిద్ధం చేసుకున్న గుమ్మడికాయ, కర్పూరంతో దిష్టి తీశారు.

- Advertisement -

పిళ్ళై, బుచ్చిబాబు వాంగ్మూలాలే కీలకం

మార్చి 16న విచారణకు హాజరుకావాలంటూ సమన్లు అందుకున్న కవిత, తాను హాజరుకాకుండా తన ప్రతినిధిగా న్యాయవాది సోమ భరత్ కుమార్‌ను పంపించడంతో ఆ రోజు అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ సాధ్యపడలేదు. ‘వ్యక్తిగతం’గా హాజరుకావాలని సమన్లలో పేర్కొనకపోవడంతో ఆ వెసులుబాటును కవిత ఉపయోగించుకుని తన ప్రతినిధిని పంపించారు. మద్యం పాలసీ కేసులో కవితకు ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు, వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలాలు కవితను విచారణకు పిలిచేలా చేశాయి. తొలుత మార్చి 11న కవితను రోజంతా ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ రోజు రాత్రి గం. 8.20న విడిచిపెట్టి మళ్లీ మార్చి 16న విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. అయితే ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైనా తనను సూర్యాస్తమయం తర్వాత కూడా ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు.

ఇంకా అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 24న విచారణ చేపడతామంటూ సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో మార్చి 16న జరగాల్సిన విచారణకు హాజరుకాకుండా తన ప్రతినిధిని పంపిస్తూ ఈడీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో సర్వోన్నత న్యాయస్థానంలో తాను దాఖలు చేసిన కేసు ఉన్నందున, ఉత్తర్వులు వచ్చే వరకు ఈడీ విచారణ జరపడం సరికాదంటూ పేర్కొన్నారు. అయినప్పటికీ ఈడీ మార్చి 20న (సోమవారం) విచారణకు హాజరుకావాలంటూ మరోసారి సమన్లు జారీ చేశారు. ఈసారి వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారు. పైగా కవితతో కన్‌ఫ్రంటేషన్ నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ అరుణ్ పిళ్ళై కస్టడీని సోమవారం మధ్యాహ్నం గం. 3.00 వరకు పొడిగించాలని స్పెషల్ కోర్టును కోరి, అనుమతి పొందారు. ఈ పరిస్థితుల్లో సోమవారం కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు.

పిళ్ళైతో కలిపి విచారణ

అరుణ్ పిళ్ళైని అరెస్టు చేయడానికంటే ముందు దాదాపు 40 పర్యాయాలు పిలిచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న ఈడీ, ఈ మొత్తం వ్యవహారం వెనుక కవిత పాత్ర ఉందని ఒక అంచనాకు వచ్చారు. పైగా ఇండో స్పిరిట్స్ సంస్థలో 32.5% వాటా తన పేరిట ఉన్నప్పటికీ, నిజానికి ఆ వాటా అసలు హక్కుదారు తాను కాదని, కవితకు ప్రతినిధిగా (బినామీ) మాత్రమే తాను ఆ కంపెనీలో ఉన్నానని పిళ్ళై చెప్పినట్టుగా ఈడీ పేర్కొంది. అసలు ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కవిత చెబుతుండడంతో ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తే (కన్‌ఫ్రంటేషన్) అసలు నిజం బయటపడుతుందని ఈడీ అధికారులు భావించారు. దీంతో పాటు ఈడీ అధికారులు సేకరించిన హోటల్ రికార్టులు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధంగా పెట్టుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం వరకు పిళ్ళైతో ఉన్న పరిచయం, వ్యాపార సంబంధాలు, ఇద్దరి మధ్య  చోటుచేసుకున్న లావాదేవీలు, చాట్ సంభాషణలు సహా కేసుతో ముడిపడ్డ అనేక అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యాహ్నం గం. 3.00 వరకు పిళ్ళై ఈడీ కస్టడీ ముగియడంతో అతణ్ణి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు. కోర్టు పిళ్ళైను ఏప్రిల్ 3 వరకు (14 రోజుల పాటు) జ్యుడీషియల్ రిమాండ్‌ విధిస్తూ తిహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే కోర్టు నుంచి పిళ్ళైని నేరుగా జైలుకు తరలించకుండా మళ్లీ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు, సాయంత్రం గం. 6.00 తర్వాత జైలుకు తీసుకెళ్లారు. ఈలోగా మరోసారి కన్‌ఫ్రంటేషన్ నిర్వహించినట్టు తెలిసింది.

రేపు మళ్లీ విచారణ

ఇప్పటి వరకు విచారణకు పిలిచే క్రమంలో మధ్యలో కనీసం 3-4 రోజుల విరామాన్ని పాటించిన ఈడీ అధికారులు, సోమవారం విచారణ అనంతరం మళ్లీ వెంటనే మంగళవారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. సోమవారం నాటి విచారణ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న కవిత వెంట ఆమె సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయక సిబ్బంది ఉన్నారు. సోమవారం విచారణకు హాజరయ్యే ముందు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలిసింది.

పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలు కే. కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్‌తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బిగాల గణేశ్ గుప్తతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యులు, భారత జాగృతి నేతలు కవిత ఉన్న 23, తుగ్లక్ రోడ్ చేరుకున్నారు. సోమవారం ఆమె విచారణకు హాజరవుతారా లేక సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో హాజరుకాకుండా ఈడీకి మరోసారి లేఖ రాస్తారా అన్న చర్చ జరిగింది. కానీ ఉదయం గం. 10.22 సమయంలో ఇంటి నుంచి బయటికొచ్చిన కవిత, సరిగ్గా 3 నిమిషాల్లో ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రోజంతా విచారణ ఎదుర్కొన్న కవితను మళ్లీ మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement