Friday, April 26, 2024

Delhi | మళ్లీ ఢిల్లీకి కవిత.. ఈడీ విచారణకు హాజరుపై వీడని సస్పెన్స్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సోమవారం జరగాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న కవిత, విచారణకు హాజరవడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలు వచ్చే వరకు విచారణ జరపడం సరికాదంటూ ఈడీకి లేఖ రాసినప్పటికీ, ఈ నెల 20న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మరోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సమన్లపై ఆమె ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆదివారం ఢిల్లీ చేరుకోవడంతో సోమవారం విచారణకు హాజరవుతారా లేక, తన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టును సోమవారం కోరతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం రాత్రి గం. 7.15 సమయంలో ఢిల్లీలోని తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) మరికొందరు కుటుంబ సభ్యులు వచ్చారు.

- Advertisement -

గత విచారణకు కలిసొచ్చిన సాంకేతిక లోపం

మార్చి 16న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లలో ఉన్న సాంకేతిక లోపం విచారణకు హాజరుకాకుండా తప్పించుకోడానికి ఆస్కారం కల్పించింది. ఆ సమన్లలో ‘వ్యక్తిగతంగా’ హాజరుకావాలని ప్రత్యేకంగా పేర్కొనకపోవడంతో తన బదులుగా ఒక ప్రతినిధిని నియమించి ఈడీ ఆఫీసుకు పంపించారు. కవిత తరఫున న్యాయవాది సోమ భరత్ కుమార్ ఈడీ ఆఫీసుకు వెళ్లి, ఈడీ కోరిన బ్యాంకు స్టేట్మెంట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. తద్వారా ఆ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకానప్పటికీ.. ‘గైర్హాజరు’గా కూడా పరిగణించలేని పరిస్థితిని సృష్టించారు. అయితే ఆ లేఖలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ గురించి వివరిస్తూ.. ఆ పిటిషన్‌పై మార్చి 24న సుప్రీం విచారణ జరపనుందని, సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో వ్యవహారం ఉండగా ఈడీ తనను ప్రశ్నించడం సరికాదని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ నెల 20న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.

ఈసారి పకడ్బందీగా సమన్లు

ఈడీ తాజా సమన్లలో ఈసారి ‘వ్యక్తిగతంగా’ అన్న పదాన్ని విస్మరించకుండా జాగ్రత్తపడ్డట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆమె సోమవారం నాటి విచారణను ఎదుర్కోక తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు. విచారణలో భాగంగా తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని ఈడీ భావించింది. మార్చి 16న కవిత వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోవడంతో పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ నిర్వహించడం కుదరలేదు. ఇదే విషయాన్ని స్పెషల్ కోర్టులో ప్రస్తావించిన ఈడీ, పిళ్ళై కస్టడీని పొడిగించాలని కోరింది. ఈ నెల 20 మధ్యాహ్నం గం. 3.00 వరకు కస్టడీని పొడిగిస్తూ ఈడీ కోర్టు అనుమతించింది. కస్టడీలో ఉన్నప్పుడు కన్‌ఫ్రంటేషన్ విధానంలో ప్రశ్నించడానికి వీలుంటుంది. తద్వారా ఒకే ప్రశ్నపై ఇద్దరు చెప్పే సమాధానాల్లో వ్యత్యాసాన్ని గుర్తించి, నిజాన్ని రాబట్టడం సాధ్యపడుతుంది. అందుకే సోమవారం నాటి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని, పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ జరపాల్సి ఉందని కవితకు జారీ చేసిన తాజా సమన్లలో విస్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది.

మాగుంటకు మరోసారి సమన్లు?

ఇదే కేసులో ఈ నెల 18న విచారణకు హాజరుకావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు హాజరుకాలేదు. సమన్లకు జవాబిస్తూ ఈ-మెయిల్ చేశారని తెలిసినా, అందులో ఏ కారణాన్ని ప్రస్తావించారన్న విషయంపై స్పష్టత లేదు. మాగుంట ఢిల్లీ నివాసంలో పనిచేసే సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారం ఆయన శుక్రవారం రాత్రే హుటాహుటిన చెన్నై బయల్దేరి వెళ్లారు. మాగుంటను సైతం పిళ్ళైతో కలిపి కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించడం కోసమే ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కానీ ఆయన హాజరుకాకపోవడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. మాగుంట కుటుంబం నిర్వహించే మద్యం వ్యాపారంలో రాఘవ రెడ్డి నేరుగా కంపెనీ డైరక్టర్‌గా ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి 2015-16లోనే చాలా కంపెనీల నుంచి వైదొలిగానని చెప్పారు. కానీ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆయన్ను సౌత్ గ్రూపులో భాగస్వామిగా దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో జరిగిన సమావేశాలు, మంతనాల్లో ఆయన కూడా ఉన్నారని, వివిధ స్టార్ హోటళ్లలో జరిగిన మీటింగులను సైతం ఉదహరిస్తూ రిమాండ్ రిపోర్టుల్లో, చార్జిషీట్లలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా ప్రశ్నించాలని భావించారు. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement