Thursday, April 25, 2024

భారతీయ సమాఖ్య స్ఫూర్తిని పెంచిన గొప్ప నాయకుడు కరుణానిధి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత డాక్టర్ ఎం.కరుణానిధి ఓ గొప్ప నాయకుడని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసిన వ్యక్తి అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. కళైంగర్ కరుణానిధి 98వ జయంతి సందర్భంగా చెన్నైలోని ఓమందురార్ ఎస్టేట్స్ లో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కరుణానిధి విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణానిధికి ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. భారతదేశం బలోపేతమైన ‘టీమ్ ఇండియా’గా బృంద స్ఫూర్తితో రూపుదిద్దుకోవడంలో కరుణానిధి సైతం తమవంతు పాత్రను పోషించారని, సమాఖ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. భారతదేశ రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న విలువలను పాటిస్తూ ప్రగతిశీల భారతదేశ నిర్మాణానికి కృషిచేసిన గొప్ప నాయకుల్లో కరుణానిధి ఒకరని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ‘1947లో భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధి లభించిన తదనంతర కాలంలో భారతదేశానికి, వివిధ రాష్ట్రాలకు ఎంతో మంది ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రుల మార్గదర్శనం లభించింది. వారందరూ దేశ పురోగతిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషించడం మనందరి అదృష్టమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇలాంటి వారిలో కళైంగర్ కరుణానిధి కూడా ఉండటం, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాల మధ్య సమాఖ్య వ్యవస్థ పరస్పర సహకారంతో కృషిచేసేందుకు వారు పోషించిన పాత్ర చిరస్మరణీయం అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టమైన సామర్థ్యం, భాషా సమృద్ధి, సాహిత్యం, సాంస్కృతిక సంపద, అద్భుతమైన నిర్మాణ సామర్థ్యం, కళలు, వ్యవసాయ, పారిశ్రామిక సామర్థ్యాలు ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, రాష్ట్రాలన్నీ తమకున్న ఈ ప్రత్యేక సామర్థ్యాలను పరస్పరం పంచుకోవడం ద్వారా సంయుక్తంగా భారతదేశ నిర్మాణంలో పాలుపంచుకున్నాయని గుర్తుచేశారు. ఇందుకోసం కరుణానిధి వంటి నాయకులు ఎంతగానో కృషి చేశారన్నారు.
దశాబ్దాలుగా కరుణానిధితో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. తన రాజకీయ సిద్ధాంతం విషయంలో కలైంగర్ నిబద్ధతతో ఉన్నారన్నారు. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యయిక పరిస్థితులను కలైంగర్ తీవ్రంగా వ్యతిరేకించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లపాటు తాను పోటీచేసిన ప్రతి ఎన్నికలోనూ గెలిచారన్న ఉపరాష్ట్రపతి, తన వాక్చాతుర్యం, చక్కటి పద ప్రయోగంతో శ్రోతలను కట్టిపడేసే ప్రసంగాలెన్నో కలైంగర్ చేశారన్నారు. వైభవోపేతమైన తమిళ సంస్కృతిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కళైంగర్ చేసిన కృషిని మరువలేమన్న ఉపరాష్ట్రపతి, మాతృదేశంతోపాటు మాతృభాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న అలాంటి వ్యక్తిని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 1970లో వారు ప్రార్థనా గీతంగా గుర్తింపు తీసుకొచ్చిన ‘తమిళ్ తై వాళ్తు’ ఆ తర్వాత రాష్ట్రగీతంగా ప్రఖ్యాతి సంపాదించుకుని, నేటికీ తమిళులకు స్ఫూర్తి రగిలింస్తోందన్నారు. నేటికీ తమిళనాడు అన్ని రంగాల్లో ప్రగతి ప్రథంలో కేంద్రంతో కలిసి పనిచేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తితో దూసుకుపోతోందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోనూ మరింత అభివృద్ధి సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, జలవనరుల శాఖమంత్రి దురై మురుగన్, ప్రధాన కార్యదర్శి డా. వి.ఇరయన్బు, కరుణానిధి గారి కుటుంబ సభ్యులు సహా వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement