Friday, March 29, 2024

16లక్షల మంది రైతులపై బ్యాంకర్ల కన్నెర్ర.. ఎన్‌పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకులు.. ఆందోళనలో రైతాంగం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వం చెప్పినా బ్యాంకర్లు పెడచెవిన పెడుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న సర్కార్‌ రాబడి లోటులో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు రుణ మాఫీ నిధులను విడుదల చేస్తోంది. ఈ ఏడాది కేంద్ర షరతులు, నియంత్రణల ఫలితంగా సర్కార్‌ ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పలు చెల్లింపులపై ప్రతిష్టంభన నెలకొంది. ఇవేవీ పట్టని బ్యాంకులు పంట రుణాలను చెల్లించని రైతులను ఎగవేత దారుల జాబితాలో చేర్చి సర్కార్‌ను అవమానిస్తున్నాయి. 2019లో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రైతు రుణమాఫీ జాబితాలో 36లక్షల మందిని రూ. లక్షలోపు అర్హులుగా గుర్తించింది. వీరు తమ బాకీని వెంటనే చెల్లించి రీ షెడ్యూల్‌ చేసుకోవాలని ఆనాడే ప్రభుత్వం సూచించింది. వీరికి చెందిన రుణమాఫీ నిధులను విడుతల వారీగా చెల్లిస్తామని బ్యాంకర్లకు చెప్పింది.
రుణమాఫీ రైతుల వివరాలు…
వివరాలు రైతులు(లక్షల్లో) రుణాలు కోట్లల్లో
రూ. 25వేల లోపు 2.96 408.38
రూ. 25వేలనుంచి 50వేలు 5.72 1790
రూ. 50వేలనుంచి 75వేలు 7 4000
రూ. 75వేలనుంచి లక్ష 21 13000
మొత్తం 36.68 10198.38
ఇప్పటివరకు సర్కార్‌ రూ. 37వేల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మిగిలిన రైతులకు రెన్యూవల్‌ సమస్య తలెత్తింది. బకాయిలు చెల్లంసఇచకుండా, రెన్యూవల్‌ చేసుకోకుండా ఇలా ఎన్‌పీఏ(ఎగవేతదారుల) జాబితాలో 7నుంచి 10లక్షల మంది ఉండొచ్చని అంటున్నారు. మరో 6లక్షలమంది రైతులు రుణమాఫీ ప్రకటనకు ముందుగా తీసుకున్న రుణాలను చెల్లించకుండా డీఫాల్టర్ల జాబితాలో చేరారు. ఇలా మొత్తం 16లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి.
2018లో ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ హామీ మేరకు రూ. లక్ష రుణమాఫీని ప్రకటించింది. ప్రతీయేటా 42లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటున్నారు. కాగా వరుసగా మూడు సీజన్లలో పూర్తి బకాయిలు చెల్లించినవారికే బ్యాంకులు రుణాలిస్తాయి. కానీ రుణమాఫీ తర్వాత కొందరు బకాయిలు ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు రీ పేమెంట్‌ చేయలేదు., ఇప్పటివరకు 5.66లక్షల మంది రుణాల మాఫీ పూర్తికాగా, మరో 31 లక్షల మందికి చెల్లింపులు చేయాల్సి ఉంది. కాగా కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును రుణాల ఖాతాలో జమ చేసుకున్నాయి.
పూచీకత్తు రుణాల్లోనూ వివక్షే…
పంట రుణాల చెల్లింపుల్లో బ్యాంకులు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయి. పూచీకత్తు లేకుండా ఒక్కో రైతుకు రూ. 1.60లక్షల వరకు, పూచీకత్తుతో రూ. 3లక్షల వరకు రుణం ఇవ్వాలన్న ఆర్భీఐ నిబంధనలను బ్యాంకులు పట్టించకోవడంలేదు. ఈ ఆర్ధిక యేడాది వరి సాగుకు ఎకరాకు రూ. 40వేల రుణం ఇవ్వాలన్న ఎస్‌ఎల్‌బీసి ఆదేశాలు కూడా బ్యాంకులు అమలు చేయడంలేదు. గతేడాది రూ. 59వేల కోట్ల పంట రుణాల లక్ష్యానికిగానూ 53శాతం రుణాలే విదిల్చారు.
ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బాధలనుంచి రైతులను విముక్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని కూడా బ్యాంకర్లు విజయవంతం చేయడంలేదు. డెబిట్‌ స్వాపింగ్‌ లోన్‌ ఇవ్వాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు అమలు కావడంలేదు. గతేడాది ఇలా రూ. 1770 కోట్ల ఇవ్వాలన్న లక్ష్యంలో 10శాతం కూడా ఇవ్వలేదు. మరోవైపు రైతులు పెట్టుబడి సాయంగా పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి క్రాప్‌ లోన్లవైపు పరుగులు పెడుతున్నారు.
సర్కార్‌ ప్రోత్సాహకాలు…
రాష్ట్రంలో రైతులను అప్పుల ఊబినుంచి తప్పించేలా సర్కార్‌ విస్తృత కార్యాచరణ చేపట్టింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ ద్వారా రైతులను ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేదింపులనుంచి రక్షణ కల్పిస్తోంది. రైతు బంధు సాయంతో ప్రతీరైతుకు అండగా నిలుస్తోంది. ఎకరాకు రూ. 10వేల ఆర్ధిక సాయం అందజేతతో రైతుకు, వ్యవసాయానికి అండగా నిల్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement