Monday, April 29, 2024

మిర్చి రైతు జోష్ ! ధరకు తిరుగులేదు.. ఎగుమతులకు ఎదురు లేదు

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఆరంభం నుంచి మిర్చి ధరలు ఎప్పటికపుడు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ వారంలో నాణ్యమైన తేజ రకం మిర్చి ధరలు రికార్డు స్థాయిలో రూ. 25 వేలు దాటడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. ఆసియా ఖండంలో అతి పెద్దదిగా గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డులో తేజ రకం మిర్చికి మంచి ధరలు లభిస్తున్నాయి. మిగిలిన రకాల మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. తేజ రకం మిర్చి బంగ్లాదేశ్‌, చైనాకు ఎగుమతులు ఉండడంతో క్వింటా రూ.24వేల నుంచి రూ.25వేల ధర లభిస్తోంది. మిగిలిన రకాలు క్వింటా రూ.20వేల నుంచి రూ.24వేల వరకు ధరలు పలుకుతున్నాయి.

ఏడాదిగా మిర్చికి మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో జనవరి నెలలో మిర్చి సాగు చేశారు. మే, జూన్‌ నెలల్లో అక్కడి మిర్చి దిగుబడులు మార్కెట్‌కు వచ్చాయి. 6 లక్షల నుంచి 8 లక్షల టిక్కీలు దిగుబడులు రావడంతో గుంటూరు యార్డు నుంచి ఉత్తర భారతదేశానికి సరకు రవాణా తగ్గింది. రెండు నెలల పాటు- స్థానికంగా ఉన్న మిర్చిని అక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ పండే మిర్చి దేశీయ అవసరాలకు మినహా విదేశాలకు ఎగుమతి చేసే అంత నాణ్యత ఉండదు. స్థానిక మార్కెట్‌లోనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఈ ప్రభావంతో గుంటూరు నుంచి ఉత్తరాదికి రవాణా అయ్యే మిర్చి పరిమాణం తగ్గింది. ఇక్కడి మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గి ధరలు నిలకడగా ఉన్నాయి. అదే సమయంలో కారం తయారీ కంపెనీలు ఇప్పటికే వారి అవసరాల మేరకు కొనుగోలు చేయడంతో తేజ మినహా మిగిలిన రకాలకు డిమాండ్‌ తగ్గింది. నాణ్యమైన తేజ రకం మిర్చికి మాత్రం డిమాండ్‌ కొనసాగుతోంది. చైనా, బంగ్లాదేశ్‌కు తేజ రకం మిర్చి ఎగుమతులు బాగున్నాయి. ప్రధానంగా బంగ్లాదేశ్‌కు పెద్దఎత్తున మిర్చి ఎగుమతి జరుగుతోంది. దీంతో తేజ రకం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

- Advertisement -

పెరిగిన విస్తీర్ణం

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రారంభంలో అధిక వర్షాలు, నల్లతామర పురుగు బెడదతో పంట దెబ్బతింది. పెట్టుబడులు పెరిగినా పంటను కాపాడుకున్న రైతులకు కొంత మెరుగైన దిగుబడులు వచ్చాయి. దీనికితోడు సాగర్‌ కాలువల నీరు ఏప్రిల్‌ వరకు రావడంతో పంట కాలం పెరిగి దిగుబడులు వచ్చాయి. జూన్‌ నెలలోనూ మార్కెట్‌కు నాన్‌ఏసీ మిర్చి రావడంతో క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో మే, జూన్‌ నెలల్లోనూ శీతలగోదాముల్లో మిర్చి నిల్వలు తీయాల్సిన అవసరం రాలేదు. గుంటూరు నగర పరిసరాల్లోని గోదాముల్లో సుమారు 50 లక్షల టిక్కీలు నిల్వ ఉండగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 70 లక్షల టిక్కీల వరకు నిల్వలు ఉన్నాయని వ్యాపారుల అంచనా.

గతేడాదితో పోల్చితే ఈసారి 15 లక్షల నుంచి 20 లక్షల టిక్కీల నిల్వలు అధికంగా ఉన్నాయి. మరోవైపు దేశీయంగా మిర్చికి డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉంది. ఉత్తరాదిన కొత్తగా సరకు రావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఈనెలాఖరు వరకు ఉత్తరాది మార్కెట్లకు స్థానిక సరకు లభ్యత ఉంటు-ంది. దీంతో రైతులు శీతలగోదాముల నుంచి ఆచితూచి బయటికి తీసి విక్రయిస్తున్నారు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో స్థానికంగా సరకు లభ్యత తగ్గిపోతే మన మిర్చికి దేశీయంగా డిమాండ్‌ పెరుగుతుంది. ప్రస్తుతం గుంటూరు మిర్చికి సగటున 40 వేల టిక్కీలు వస్తుండగా అంతేస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి.

ఆగస్టు నెలలో అమ్మకాలు మరింత పుంజుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్‌తోపాటు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలకు ఎగుమతులు పెరగడానికి మరింత సమయం పడుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నందున ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తేజ రకం ఎగుమతులు బాగున్నందున డిమాండ్‌ ఉందని, మిగిలిన రకాల ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని గుంటూరుకు చెందిన ఎగుమతి వ్యాపారి కొత్తూరి సుధాకర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement