Monday, April 29, 2024

జగన్ పాలనపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది: నాదెండ్ల మనోహర్

ఏపీలో రెండేళ్ల జగన్ పాలన వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తుపై బెంగతో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని ఆర్ధిక లోటు వేధిస్తోందని, రూ.వేల కోట్లు ఎటు వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియడం లేదని ఆరోపించారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడితప్పిందనే విషయం దేశమంతటా తెలిసిందన్నారు. ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా గొంతునొక్కే ప్రయత్నం చేయడం తప్ప సమస్యకు పరిష్కారం చేయాలనే జ్ఞానం ఈ ప్రభుత్వానికి కరువైందని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.

మరోవైపు గురువారం నాడు రాజమండ్రిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తలకు బీమా ప్రతాలు, ఐడీ కార్డులను నాదెండ్ల మనోహర్ అందజేశారు. పవన్ కళ్యాణ్ ఇష్టమైన కార్యక్రమం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అని, ఇటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లిన కార్యకర్తలను అభినందించడం మన కర్తవ్యమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ప్రమాదం జరిగినా పార్టీ సానుభూతిపరులు స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో మార్పు కోరుకుంటూ యువత జనసేనలో చేరుతున్నారని… జనసేన కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement