Friday, April 26, 2024

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ నేరమా ? : రేవంత్ రెడ్డి

భీంగల్ టౌన్, మార్చి 12 ( ప్రభ న్యూస్) : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు నిజామాబాద్ జిల్లా నుండే మార్పు మొదలు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భీంగల్ మండలం లింబాద్రి గుట్టకు వచ్చిన అయన శ్రీ లక్మీ నరసింహుని దర్శించుకున్నారు. అనంతరం కొండ కింది ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన నేరమా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగించిన ప్రజలకు పంగనామాలు పెట్టారని, అలాంటి దండుపాళ్యం ముఠాను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కొరకు రైతులు, మేధావులు, యువకులు, మహిళలు ఆలోచన చేయాలని కోరారు. జిల్లాలో పర్యటించి ఇక్కడి ప్రజల సమస్యలు తెలుకోవడంతో పాటు వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిపెస్టో లో చెరుస్తామని వెల్లడించారు.

విలువలు లేని ప్రజా ప్రతినిధులు.
ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా నుండి పని చేసిన నాయకులకు రాష్ట్రంలో మంచి విలువలు ఉండేవని అన్నారు. కానీ నేటి లీడర్లకు ఇసుక దందా, క్వారీల నిర్వహణ, బెదిరింపులు, భూకబ్జాలు లాంటి వాటిని హస్త గతం చేసుకుని దోపిడినే ప్రదానంగా మారిందని ఆరోపించారు. పదవులకు లాలూచిపడి కొందరు నాయకులు పార్టీలు మారి నేడు నీతులు వల్లిస్తున్నారని దుయ్యాబట్టారు.

రైతు దీక్షతోనే ఢిల్లీ అధిష్టానం గుర్తించింది
నిజామాబాద్ లో జనవరి 2021 లో నిర్వహించిన పసుపు బోర్డు, రైతులకు మద్దతు ధర సభ, ఆర్మూర్ లో నిర్వహించిన రైతు దీక్షల విజయవంతంతోనే ఢిల్లీ అధిష్టానం నన్ను గుర్తించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభలు విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డికి రైతులు, యువకులు, మహిళలు మద్దతుగా ఉన్నారని గ్రహించిన అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని గుర్తుచేసారు. ఈ ప్రాంతంలోని రైతులకు పోరాటం చేసే సత్తా ఉందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజలు, రైతులు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాహేర్ బిన్ హందాన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు బోదిరే స్వామి, కుంట రమేష్, గోపాల్ నాయక్, నాగేంద్ర బాబు, జేజే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సుమారు ఐదు వందల బైక్ ల‌తో ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి గణస్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement