Thursday, April 25, 2024

ఉక్రెయిన్‌పై సైనిక చర్య రష్యాకు ఇరాన్‌ మద్దతు.. అమెరికా ఆరోపణలు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలో ఇరాన్‌ పూర్తి మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. ఇప్పటికే ఇరాన్‌ డ్రోన్లతో మాస్కో సేనలు తమపై దాడులు చేస్తున్నాయని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్న వేళ అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా- ఇరాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిస్థాయి రక్షణ భాగస్వామ్యంగా మారాయని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. ఆయుధాల అభివృద్ధి, సైనిక శిక్షణ రంగాల్లో ఇరాన్‌తో కలిసి రష్యా పనిచేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌కు అధునాతన ఆయుధాలు అందించాలని రష్యా కూడా భావిస్తోందని అమెరికా అనుమానం వ్యక్తంచేసింది. రష్యా అతిపెద్ద సైనిక మద్దతుదారుగా ఇరాన్‌ మారిందని కిర్బీ విమర్శించారు.

ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి రష్యా, ఇరాన్‌ డ్రోన్‌లను ఉపయోగించిందని అమెరికాతోపాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌- రష్యా సంబంధాలు ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాకు డ్రోన్ల సరఫరా ప్రపంచ భద్రతను అస్థిరపరుస్తుందన్న ఆస్ట్రేలియా, దాని పర్యవసాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను ఇరాన్‌ ఖండిస్తోంది. తాము రష్యాకు తాజాగా ఎలాంటి డ్రోన్లు సరఫరా చేయలేదని పేర్కొంది. అయితే ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ముందు డ్రోన్లను రష్యాకు సరఫరా చేసినట్లు ఇరాన్‌ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement