Sunday, May 5, 2024

ఐపీఎస్‌లకు పదోన్నతులు.. సీఐడీ చీఫ్‌, మరో ఇద్దరికి డైరెక్టర్‌ జనరల్‌ హోదా

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు నూతన సంవత్సర కానుక లభించింది. సీనియర్‌ పోలీసు అధికారులు కొందరికి పదోన్నతి లభిస్తే.. మరి కొందరు ఐపీఎస్‌లకు సీనియర్‌ అధికారులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ప్రస్తుతం ఏపీ క్యాడర్‌కు చెందిన ముగ్గురు అదనపు డీజీపీ హోదా కలిగిన అధికారులకు డైరె క్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) క్యాడర్‌ లభించింది. వీరిలో సిఐడి చీఫ్‌ పివి సునీల్‌ కుమార్‌ ఒకరు. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ పలువురు ఐపీఎస్‌లకు ప్రమోషన్‌ ఇస్తూ జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీ హోదాలో పని చేస్తున్న ఏపీ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు మహేష్‌ దీక్షిత్‌, అమిత్‌ గార్గ్‌, పీవీ సునీల్‌కుమార్‌లకు డీజీలుగా ప్రమోషన్‌ లభించింది. ప్రస్తుతం పీవీ సునీల్‌కుమార్‌ సిబి సిఐడి చీఫ్‌గా ఉన్నారు.

డీజీగా పదోన్నతి లభించిన ఈయన ఆ హోదాలో ఇక నుంచి సీఐడి చీఫ్‌గా కొనసాగనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సర్వీసుల్లో ఉన్న మహేష్‌ దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌లు కూడా డీజీ హోదాలో అక్కడే కొనసాగుతారు. డీజీగా పదోన్నతి లభించిన సందర్భంగా పీవీ సునీల్‌కుమార్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయనకు సీఎం అభినందనలు తెలిపారు.

- Advertisement -

డీఐజిలకు ఐజీలుగా ప్రమోషన్‌..

అదేవిధంగా రాష్ట్రంలో డిఐజిలుగా పని చేస్తున్న 2005 బ్యాచ్‌కు చెందిన మరో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు కూడా ఐజీలుగా పదోన్నతి లభించింది. ఏపీ క్యాడర్‌ కు చెందిన ఎస్‌ శ్యాంసుందర్‌ ప్రస్తుతం ఇంటర్‌ క్యాడర్‌ డెప్యూటేషన్‌ కింద కేరళ రాష్ట్రంలో పని చేస్తున్నారు. పదోన్నతితో ఇక నుంచి ఆయన ఐజీ హోదాలో పని చేయనున్నారు. అదేవిధంగా ఏలూరు రేంజ్‌ డిఐజి జి పాలరాజు, గుంటూరు రేంజ్‌ డిఐజి డాక్టర్‌ సీఎం త్రివిక్రమ వర్మలకు ఐజీలుగా ప్రమోషన్‌ లభించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం అక్కడే కొనసాగనున్నారు.

ముగ్గురికి డీఐజిలుగా పదోన్నతి..

అలాగే 2009 బ్యాచ్‌కు చెందిన మరో ముగ్గురు ఎస్పీ క్యాడర్‌ ఐపీఎస్‌లకు డిఐజిలుగా పదోన్నతి లభించింది. విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏఐజిగా లా అండ్‌ ఆర్డర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి లు ఆయా పోస్టుల్లో డిఐజీలుగా కొనసాగుతారు. అదేవిధంగా సెంట్రల్‌ డిప్యూటేషన్‌లో కొనసాగుతున్న భాస్కర్‌ భూషణ్‌కు డిఐజిగా ప్రమోషన్‌ వచ్చింది. ఇక ఏలూరు జిల్లా ఎస్పీగా పని చేస్తున్న రాహుల్‌దేవ్‌ శర ్మను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ప్రభుత్వం ప్రమోట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement