Friday, May 3, 2024

ఈ వారంలోనే ఇంటర్‌, టెన్త్‌ ఫలితాలు?.. జులై 1 నుంచి ఫస్ట్‌ ఇయర్ క్లాసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఇంటర్‌, టెన్త్‌ ఫలితాలు ఈ వారం రోజుల్లోపలనే విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదల చేసేందుకు అటు ఇంటర్‌ బోర్డు అధికారులు ఇటు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇంటర్‌ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఒక స్పష్టత ఇవ్వడంలేదు. త్వరలోనే విడుదల చేస్తామని, అదే పనిలో ఉన్నట్లు బోర్డు అధికారులు చెప్తూ వస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ వారంలోనే ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఉన్నట్లు సమాచారం.

ఈనెల 25వ తేదీలోపల లేదంటే ఈనెల 27న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మే 6వ తేదీ నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల రోజుల లోపల్లోనే ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ప్రకటించారు. ప్రస్తుతం నెల రోజులు కావొస్తున్నా ఫలితాల ప్రకటనపై స్పష్టత ఇవ్వడంలేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,07,393 మంది విద్యార్థులు హాజరయ్యారు.

జులై 1 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు…

పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగాయి. ప్రధాన పరీక్షలు ముగిసి కూడా 20 రోజుల పైనే అవుతోంది. ఈక్రమంలో టెన్త్‌ ఫలితాలు ఈనెల చివరికల్లా వెలువరించనున్నట్లు తెలుస్తోంది. టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల ప్రకటన మధ్య ఒకటి రెండు రోజుల తేడా మాత్రమే ఉండనుంది. ఇంటర్‌ బోర్డు ప్రకటించిన 2022-23 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జులై 1వ తేదీ నుంచి ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి ముందే టెన్త్‌ ఫలితాలను వెలువరించాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా టెన్త్‌ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

- Advertisement -

221 పనిదినాలతో విద్యా సంవత్సరం…

ఇంటర్మీడియట్‌ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైంది. ఈ విద్యా సంవత్సరం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 221 పనిదినాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్‌ 15 నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక జులై 1 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఇచ్చారు. వచ్చే ఏడాది 2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.

ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక వార్షిక పరీక్షలను మాత్రం మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు మే చివరి వారంలో ఉంటాయని పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరానికి తిరిగి కళాశాలలు జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 1 నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మారడంతో ఈ విద్యా సంవత్సరం రెండు వారాలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement