Thursday, May 2, 2024

భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ.11.59 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఖాతా రూ.1290 కోట్లు.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ.11.59 లక్షల కోట్లు కాగా, అందులో ఆంధ్రప్రదేశ్ ఖాతా రూ.1290 కోట్లని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2021-22లో మనదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం సమాధానమిచ్చారు. భారత్ నుంచి జరుగుతున్న సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల ఎగుమతులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని కేంద్రమంత్రి వివరించారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు అని, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1 శాతం మాత్రమేనని అన్నారు. పెద్దసంఖ్యలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీ రంగ ఎగుమతులకు ఉపయోగపడుతోందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం పరిస్థితి దయనీయంగా ఉందని ఎంపీ జీవీఎల్ విమర్శించారు. అత్యంత విజయవంతమైన, సమర్థవంతమైన ఐటీ రంగానికి మానవ వనరులను అందించడంలో దేశానికి, ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వెనుకబడిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement