Friday, May 10, 2024

IND vs WI | విండీస్‌తో టెస్ట్ సిరీస్‌.. విజ‌యంపై క‌న్నేసిన భార‌త్‌

వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా.. వెస్టిండీస్ తో ఆడిన మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో 141 ప‌రుగుల తేడాతో ఇన్నింగ్స్ గెలిచింది. ఇక‌ జులై 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇప్పుడు రెండు జట్లు రెడీ అవుతున్నాయి. డొమినికాలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పిచ్.. స్పిన్నర్లకు అనుకూలించింది. రెండో టెస్టు జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకారం అందించే అవకాశాలున్నాయి. దీంతో జట్టు కూర్పు టీమిండియాకు ఇప్పుడు సవాలుగా మారింది. సెకండ్ టెస్టుకు అక్షర్ పటేల్ రూపంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది.

మొదటి టెస్టులో కేవలం 9 ఓవర్లు వేసిన పేసర్ జయదేవ్ ఉనద్కత్ స్థానంలో అక్షర్‌ టీమ్‌లోకి రావచ్చు. అయితే ఈ విషయంపై టీమ్ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఎందుకంటే రెండో టెస్టు జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పిచ్ సీమ్‌కు అనుకూలించవచ్చు. దీంతో ఫ్రంట్‌లైన్ సీమర్లకు పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. అందుకే మూడో స్పిన్నర్‌తో బరిలోకి దిగే ఆలోచన ఉన్నప్పటికీ, మ్యాచ్ రోజు పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్‌మెంట్ దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.

జట్టు కూర్పుపై వాతావరణం ఎఫెక్ట్..

- Advertisement -

మ్యాచ్ జరిగే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్పిన్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మూడో సీమర్‌ జట్టులో ఉండాలి. ఒకవేళ వాతావరణం తేలిపోయి, పిచ్ ఎప్పటిలాగానే ఉంటే, అది స్పిన్‌కు అనుకూలిస్తుంది. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో టెస్టు మ్యాచ్ జరగక చాలా రోజులు అయింది. 2018లో అక్కడ చివరి టెస్ట్‌ జరగ్గా, అప్పట్లో ప్రారంభంలోనే పిచ్ మంచి బౌన్స్, సీమ్‌కు అనుకూలించింది. అయితే చివరి రెండు రోజులు స్పిన్నర్లు సత్తా చాటారు. ఇక్కడ భారత్ ఆడిన చివరి మ్యాచ్‌లో వర్షం పడింది. ఆ టెస్టులో భారత బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించగా, ఆ తర్వాత చాహల్ నాలుగు వికెట్లతో భారత్‌ను గెలిపించాడు. అంటే పిచ్ స్లోగా ఉంటుందని తెలుస్తోంది.

వీరి ప్లేస్‌లు ఫిక్స్

మొదటి టెస్టుతో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్, రోహిత్‌తో కలిసి భారీ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ నమోదుచేశాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్‌కు ఓపెనింగ్‌ బ్యాటర్‌గా అవకాశం దక్కే సూచనలు లేవు. విరాట్ కోహ్లి, అజింక్యా రహానే నంబర్ 4 & 5 స్థానాల్లో కొనసాగుతారు. ఇషాన్ కిషన్ కీపర్‌గా కొనసాగనున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 17 వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ ప్రధాన పేస్ బౌలర్‌గా కొనసాగుతుండగా, శార్దూల్ ఠాకూర్ అతడికి సపోర్టింగ్‌గా ఉంటాడు.

గిల్‌ పరిస్థితి ఏంటి?

శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఫస్ట్ టెస్టులో అతడు 3 పరుగులే చేశాడు. రెండో టెస్టు తర్వాత, సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో ఈ ఫార్మాట్‌లో తనదైన మార్క్ చూపేందుకు శుభ్‌మన్ గిల్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. రానున్న రోజుల్లో శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ ఇద్దరూ టీమ్‌లోకి తిరిగి రావచ్చు. దీంతో గిల్ పొజిషన్‌కు పోటీ గట్టిగా ఉంటుంది. డొమెస్టిక్, కౌంటీ క్రికెట్‌లో చెతేశ్వర్ పుజారా తిరిగి ఫామ్‌లోకి వస్తే, శుభ్‌మన్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమే. గిల్‌కి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ సపోర్ట్ ఉన్నప్పటికీ, అతడు ఆ మేరకు అంచనాలు అందుకోవాల్సిన అవసరం ఉంది.

విండీస్‌తో రెండో టెస్టులో ఆడే జట్టు అంచనా:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (WK), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్/అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement