Sunday, May 19, 2024

అమెరికా చదువులకే మొగ్గు.. యూఎస్‌లో ఉన్నతవిద్యకు భారతీయ విద్యార్థుల ఆసక్తి

ఉన్నత విద్యకోసం భారతీయ విద్యార్థుల ఎంపికలో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తోంది. అక్కడి యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం మన విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. చదువుల కోసం అమెరికా వెళ్తున్న ఇండియన్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో స్తబ్దత తర్వాత పరిస్థితి మళ్లి యదాతథ స్థితికి చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ మేరకు ఓపెన్‌ డోర్స్‌ (ఒడిఆర్‌) నివేదికను ఉటంకిస్తూ అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓపెన్‌ డోర్స్‌ నివేదిక ప్రకారం, అమెరికాకి భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 35శాతం పెరిగి, 2022-23 విద్యా సంవత్సరంలో 2,68,923 మంది విద్యార్థులతో ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయికి చేరింది. వీరిలో 41 శాతం మంది (గ్రాడ్యుయేషన్‌, అండర్‌ గ్రాడ్యుయేషన్‌) గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ను ఎంచుకున్నారు.

చైనాను దాటేసిన భారత్‌..

- Advertisement -

తాజా అకాడమిక్‌ సంవత్సరంలో అమెరికా యూనివర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే గరిష్ఠం. ఓపెన్‌డోర్స్‌ నివేదిక ప్రకారం, 2009-10 తర్వాత మొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులలో చైనాను భారత్‌ అధిగమించింది. అంతే కాకుండా గతేడాదితో పోల్చితే యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెరిగి 1,65,936కి పెరిగింది.

అదే సమయంలో అండర్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 16శాతం పెరిగింది. అలాగే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఒపిటి)ని ఎంచుకున్న విదేశీ విద్యార్థులలోనూ భారతీయులే (69,062) ముందున్నారు. అర్హులైన విద్యార్థులు తమ అధ్యయన రంగంలో ప్రాక్టికల్‌కు వీలుగా ఒకవిధమైన తాత్కాలిక పని లైసెన్స్‌ను ఒపిటి అనుమతిస్తుంది. 2023 జూన్‌-ఆగస్టులో భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ, కాన్సులేట్‌లు అత్యధిక సంఖ్యలో విద్యార్థి వీసాలను మంజూరు చేశాయి. ఈ కాలంలో ఎఫ్‌, ఎం, జె కేటగిరీలలో 95,269 వీసాలను మంజూరు చేశారు. గతేడాది ఇదే వ్యవధితో పోల్చితే 18శాతం అధికం.

గణితం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ కోర్సులకు డిమాండ్‌

భారత్‌, చైనా తర్వాత బంగ్లాదేశ్‌ (28శాతం), కొలంబియా, ఘనా ((32శాతం), భారత్‌ (35శాతం), ఇటలీ, నేపాల్‌ (28శాతం), పాకిస్థాన్‌ (16శాతం) విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యకు ప్రవేశాలు పొందారు. అమెరికా గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్‌, టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్‌లలో 21 శాతం పెరుగుదల కనిపించగా, యూజీల్లో ఒక శాతం పెరిగింది.

గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌, బిజినెస్‌ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇలినోయ్‌, టెక్సాస్‌, మిషిగాన్‌లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉండటం విశేషం.

కొవిడ్‌ కంటే ముందు (2018లో) అమెరికా ఉన్నత విద్యకోసం నమోదు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య (2015-16నుంచి) ఏటా సుమారు 11 లక్షలుగా ఉంటోంది. కొవిడ్‌ తర్వాత రెండేళ్లపాటు ఈ సంఖ్య తగ్గింది. తాజాగా క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది మళ్లిd 11లక్షలకు చేరువయ్యింది. ఇలా విదేశీ విద్యార్థులను గణనీయంగా ఆకర్షిస్తున్నప్పటికీ.. స్థానిక విద్యార్థులను రప్పించడంలో అమెరికా ఉన్నత విద్యాసంస్థలు కష్టాలు పడుతున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement