Monday, May 6, 2024

భార‌తీయ‌ రైల్వే మ‌రో రికార్డు.. 122.2 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా

అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే సరుకు రవాణాలో 2021- 22 సంవత్సరం నుంచి అత్యుత్తమ పనితీరుతో ఏప్రిల్‌ నెలలోసరికొత్త రికార్డును నమోదు చేసింది. 2021 ఏప్రిల్‌లో 111.64 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగా, 2022 ఏప్రిల్‌లో 10.5 మిలియన్‌ టన్నుల(9.5 శాతం వృద్ధి) పెరుగుదలతో 122.2 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ను సాధించింది. దీంతో భారతీయ రైల్వే వరుసగా 20 నెలలు ఉత్తమ గణాంకాలను నమోదు చేసినట్లయింది. రైల్వే ద్వారా బొగ్గు లోడింగ్‌, ఎన్‌టీకేఎం, ఆహార ధాన్యాల లోడింగ్‌, ఎరువుల లోడింగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదు చేయడంతో ఈ వృద్ధి సాధ్యమైంది. స్టీల్‌ ప్లాంట్లు(ఐరన్‌ ఓర్‌తో సహా), ఫినిష్డ్‌ స్టీల్‌కు సంబంధించి ముడిసరుకు మినహా అన్ని వస్తువులు గతేడాది వృద్ధిని నమోదు చేశాయి.

రోజుకు లోడ్‌ అయిన వ్యాగన్ల సంఖ్య కూడా 9.2 శాతం పెరిగింది. గతేడాది ఏప్రిల్‌ నెలలో 60434 వ్యాగన్ల లోడింగ్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో రోజుకు 66024 వ్యాగన్లను లోడ్‌ చేసింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ,బొగ్గు దిగుమతిని తగ్గించడంతో(అంతర్జాతీయంగా అధిక బొగ్గు ధరల కారణంగా) దేశీయ బొగ్గుకు గణనీయమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవసరాలను రైల్వేలు తీరుస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు బొగ్గు లోడింగ్‌ను 32 శాతం అధికంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయడమే ఇందుకు నిదర్శనంగా ఉంది. ఇదే ప్రక్రియను 2022 ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తూ భారతీయ రైల్వే బొగ్గు లోడింగ్‌లో(దేశీయ, దిగుమతి రెండింటిలో) వృద్ధి సాధించింది. రైల్వే లోడింగ్‌, రవాణాలో గణనీయమైన వృద్ధి సాధించడంపై ఉన్నతాధికారులు రైల్వే అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement