Thursday, May 9, 2024

భారత హాకీ జట్టుకు భారీ నజరానా..

ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన టీమిండియా హాకీ జట్టుకు భారీ నజరానా లభించింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4-3 గోల్స్‌ తేడాతో పటిష్టమైన మలేసియా జట్టును ఓడించి నాలుగోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీలో చిరస్మరణియా ప్రదర్శనలు చేసిన టీమిండియా హాకీ ప్లేయర్లకు భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ దిలీప్‌ టిర్కే భారీ నజరానాను ప్రకటించారు.

టీమిండియా ఆటగాళ్లలో ప్రతి ఒక్కరికి 3 లక్షలు నగదు బహుమతి ప్రకటించారు. మరోవైపు జట్టు సహాయక సిబ్బందికి 1.50 లక్షల నజరానాను ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చెన్నై వేదికగా జరిగిన మెగా టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా హాకీ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా భారీ నజరానాను ప్రకటించారు. ప్రతి ఆటగాడికి 5 లక్షలు, సహాయక సిబ్బందికి 2.5 లక్షలు ఇస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక భారత్‌ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు ఆద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టోర్నీలో ఒక్క ఓటమిని కూడా ఎరుగని టీమిండియా గ్రూపు దశలో 5 మ్యాచుల్లో 4 విజయాలు సాధించి ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో చైనాను 7-2 గోల్స్‌తో చిత్తు చేసిన టీమిండియా రెండో మ్యాచ్‌లో (1-1 గోల్స్‌)జపాన్‌తో డ్రా చేసుకుంది.

- Advertisement -

తర్వాత మూడవ మ్యాచ్‌లో మలేసియాపై 5-0 గోల్స్‌తో విజయం సాధించడంతో పాటూ నాల్గో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాను 3-2 గోల్స్‌ తేడాతో ఓడించింది. ఇక లీగ్‌ చివరిదైన ఐదో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టును 4-0 గోల్స్‌ తేడాతో చిత్తు చేసి నాకౌట్‌లో దూసుకెళ్లింది. తర్వాత నాకౌట్‌ సెమీఫైనల్లో భారత జట్టు 5-0 గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తు చేసి తుదిపోరుకు సిద్ధమైంది. ఇక ట్రోఫీ పోరులో మలేసియాను 4-3 గోల్స్‌తో ఓడించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

టోర్నీలో రాణించి అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు:

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ: భారత ఆల్‌రౌండర్‌ మన్‌దీప్‌సింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును గెలుచుకున్నాడు. టోర్నీలో మూడు గోల్స్‌ మాత్రమే చేసినా.. ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్స్‌ చేయకుండా వారిని సమర్థంగా అడ్డుకున్నాడు.

టాప్‌ స్కోరర్‌ ఆఫ్‌ ది టోర్నీ: భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సారథి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఈ టోర్నీలో మొత్తం 9 గోల్స్‌ నమోదు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మోస్ట్‌ గోల్స్‌ ఆఫ్‌ ది టోర్నీ: టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన భారత జట్టు (29 గోల్స్‌) ఈ అవార్డును సొంతం చేసుకుంది.

బెస్ట్‌ గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ది టోర్నీ: దక్షిణ కొరియా గోల్‌ కీపర్‌ కిమ్‌ జేహియోన్‌ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇతను ప్రత్యర్థి గోల్స్‌ దాడులను అద్భుతంగా అడ్డుకున్నాడు.

బెస్ట్‌ రైజింగ్‌ గోల్‌కీపర్‌ ఆఫ్‌ ది టోర్నీ: జపాన్‌ను మూడో స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు యువ గోల్‌ కీపర్‌ టాకుమి కిటగావా రైజింగ్‌ స్టార్‌ గోల్‌కీపర్‌ అవార్డు దక్కించుకున్నాడు.

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ: ఈ టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది.. కానీ ఆ జట్టులో యువ ఆటగాడు అబ్దుల్‌ షాహిద్‌ హన్నాన్‌ మాత్రం గొప్ప ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు అతనికే సొంతమైంది.

బెస్ట్‌ గోల్‌ ఆఫ్‌ ది టోర్నీ (ఫ్యాన్‌ చాయిస్‌) అవార్డు: మైదానంలో చురుగ్గా కదులుతూ ప్రత్యుర్థులను పల్టిd కొట్టిస్తూ గోల్స్‌ సాధించిన భారత ఆటగాడు సెల్వం కార్తికి ఈ అవార్డు దక్కింది.

ఈ అవార్డులు గెలుచుకున్నా ప్రతి ఆటగాడికి (యూఎస్‌డీ) 1000 డాలర్లు నగదు లభించగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీకి మాత్రం 2000 (యూఎస్‌డీ) డాలర్ల నజరానా లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement