Monday, April 29, 2024

డిసెంబ‌ర్ నాటికి దేశ ప్ర‌జ‌లంద‌రికీ టీకాలు

దేశ ప్ర‌జలంద‌రికీ డిసెంబ‌ర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్ల‌డించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించి 130 రోజులైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 20 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో టీకాలే కీల‌క‌మ‌ని అంద‌రూ చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సినేష‌న్‌లో 20 కోట్ల మైలురాయిని అందుకున్న రెండ‌వ దేశంగా ఇండియా నిలిచింది. ఈ ఘ‌న‌త‌ను కేవ‌లం అగ్ర‌రాజ్యం అమెరికా మాత్ర‌మే చేరుకుంది. గ‌త 44 రోజుల్లో ఇవాళ అత్య‌ల్ప స్థాయిలో కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. 2.48 కోట్ల మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో 2.59 ల‌క్ష‌ల మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అయ్యారు.

అటు వ్యాక్సినేషన్ విషయంలో ప్ర‌ధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. 130 కోట్ల మంది జ‌నాభాలో కేవ‌లం 3 శాతం మందికి మాత్ర‌మే టీకాలు ఇచ్చిన‌ట్లు రాహుల్ ఆరోపించారు. సెకండ్ వేవ్ విజృంభించ‌డానికి మోదీనే కార‌ణ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాహుల్ గాంధీకి కౌంట‌ర్ ఇచ్చిన జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ.. 2021 లోపే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగుస్తుంద‌న్నారు. వ్యాక్సిన్ల గురించి రాహుల్ ఆందోళ‌న చెందితే, అప్పుడు ఆయ‌న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాల‌న్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ గంద‌ర‌గోళంగా సాగుతోంద‌ని, 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను వాళ్లు తీసుకోవ‌డం లేద‌ని జ‌వ‌దేక‌ర్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement