Friday, April 26, 2024

ఇండియన్ వర్సెస్ న్యూజిలాండ్

క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయానికి మ‌రి కొన్ని గంట‌ల్లో తెర‌లేవ‌బోతోంది. ఇప్ప‌టికే వ‌న్డే, టీ20ల‌లో ఎన్నో చాంపియ‌న్ టీమ్స్‌ను చూసిన క్రికెట్‌.. త‌న తొలి టెస్ట్ చాంపియ‌న్‌ను చూడ‌బోతోంది. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ శుక్ర‌వారం నుంచి ప్రారంభం కాబోతోంది. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి ఫైన‌ల్ కోసం ఇండియా, న్యూజిలాండ్ టీమ్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ టీమ్స్‌.. తొలి టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ను సొంతం చేసుకోవ‌డానికి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

సౌథాంప్ట‌న్‌లోని ఎజియ‌స్ బౌల్ స్టేడియంలో ఈ రెండు టీమ్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల‌ను ఐసీసీ త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డ‌టానికి రెండు వారాల కింద‌టే అక్క‌డికి వెళ్లిన కోహ్లి సేన‌.. కొన్నాళ్లు క్వారంటైన్ త‌ర్వాత ప్రాక్టీస్ ప్రారంభించింది. నెట్ ప్రాక్టీస్‌తోపాటు టీమ్ రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా చేసింది. ఇప్ప‌టికే ఈ ఫైన‌ల్ వార్ కోసం 15 మంది స‌భ్యుల టీమ్‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది. వీళ్ల‌లో బ‌రిలోకి దిగ‌బోయే తుది 11 మంది ఎవ‌ర‌నేది మ్యాచ్‌కు ముందే తేల‌నుంది. ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతుందా లేక న‌లుగురు పేసర్ల‌తోనా అన్న‌ది తేలాల్సి ఉంది.

మ‌రోవైపు ఈ ఫైన‌ల్‌కు కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కూ అండ‌ర్‌డాగ్ టీమ్‌గా భావించిన న్యూజిలాండ్‌.. తాజాగా ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల సిరీస్ గెలిచి ఫేవ‌రెట్‌గా మారిపోయింది. ఇంగ్లండ్‌ను వాళ్ల సొంత‌గ‌డ్డ‌పై ఓడించ‌డం కివీస్ ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కూల్ అండ్ కామ్ విలియ‌మ్స‌న్ కెప్టెన్సీలో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ టీమిండియాకు షాకివ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement