Monday, April 29, 2024

మోదీ పాల‌న‌లో ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా భార‌త్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ న‌గర్, ప్రభ న్యూస్ : తొమ్మిదేళ్లుగా భారత ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రజల మెప్పు పొందిన పరిపాలన సాగుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహా జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాలమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ న‌గర్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు ప్రత్యేక రైలును ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. రాబోయే రోజుల్లో కర్నూలు నుండి వయా గద్వాల్ మీదుగా జైపూర్ వరకు మరో కొత్త రైలు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. 2014 తర్వాత భారత ప్రధాని మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో భారత్ ప్రపంచ దేశాల్లోని అగ్రగామిగా నిలిచిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భారత దేశంలోని ప్రతి పౌరుడిని వివిధ కుల సంఘాల నాయకులను కలిసేందుకు ఏర్పాటు చేసిన మహా జనసంపర్క యాత్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా ఆధ్వర్యంలో మే 30వ తేదీ నుండి జూన్ 30 వరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. దేశాన్ని అవినీతి, అక్రమాలు ప‌ట్టిపీడిస్తున్న వేళ మోడీ సర్కార్ దేశ ప్రజలకు ఆర్థిక సామాజిక అభివృద్ధి సంస్కరణలతో అండగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీని అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చి సీఎం కేసీఆర్ నాకు జాతీయ స్థాయిలో సహకరించండి మీమీ పార్టీలకు ఆర్థికంగా అండగా ఉంటా అనడం వారి అవినీతి పాలనకు పరాకాష్ట అని ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించారని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా స్థానిక ఓటర్లు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్టికల్ 370 త్రిబుల్ తలాకు జమ్మూ కాశ్మీర్ సమస్యలు పరిష్కరించిందని గుర్తు చేశారు.

రామ మందిరం నిర్మాణంలో భాగంగా అహింస మార్గంలో న్యాయస్థానం ముందు రుజువులు, సాక్షాలు ఉంచి 2024లో భవ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నామన్నారు. దేశంలో ఎస్ఐ ఉగ్రవాద సంస్థలు అరికట్టి రూపుమాపడంతో పాటు డిజిటల్ లావాదేవీలతో అవినీతికి అవకాశం లేకుండా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల వాటాలో రాష్ట్రానికి 42 శాతం తిరిగి పన్నులు చెల్లించిన ఘనత కూడా భాజాప సర్కార్ దే అన్నారు.తెలంగాణ సర్కార్ రైతుబంధు పేరుతో సంవత్సరానికి రూపాయలు పదివేలు ఇస్తా అని చెబుతున్న గొప్ప మాటలకు అంతకుమించి రైతులకు భాజ‌పా సర్కార్ సగటున ఏడాదికి రూపాయలు 18254 ఎరువుల సబ్సిడీతో సమకూరుస్తుందన్నారు. దీనికి తోడు ప్రతి ఏటా పంటసాయం కింద రూపాయల 6000 కూడా చెల్లిస్తున్న విషయాన్ని ఆయన ప్రజలకు వివరించారు. పాలమూరు జిల్లాలో కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించారా అని ప్రశ్నించారు. అంతేకాక ప్రతి ఒక్క పేదవారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఇస్తానని చెప్పి గడచిన తొమ్మిదేళ్లలో ఎంతమందికి ఇచ్చారో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

రూపాయలు 2000 నోటు రద్దు కాదని విడుతల వారీగా ఉపసంహరణకు సర్కార్ సిద్ధమైందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించి సెప్టెంబర్ 30 నాటికి 2000 రూపాయల నోటును బ్యాంకుల్లో చెల్లించవచ్చని తెలిపారు. 2018 వ సంవత్సరం మే నెలలోనే ఈ నోట్లకి సంబంధించి ముద్రణ కూడా ఆపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జాతీయ నేత జితేందర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు తల్లోజీ ఆచారి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, ఇతర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement