Monday, April 29, 2024

Suspend – భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు…షాక్ లో రెజ్ల‌ర్లు…

ఢిల్లీ – ప్రపంచ వేదికపై రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ప్రకటించింది. సమాఖ్య ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది.

ఈ పరిణామంతో భారత్‌ రెజ్లర్లు రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీ పడాల్సి ఉంటుంది. ”డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది” అని భారత ఒలిపింక్‌ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.


కాగా, మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్‌ఐ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని ఆందోళన చేయడంతో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను భార‌త ఒలింపిక్ అసోసియేష‌న్ రద్దు చేసింది. ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటవ్వగా అక్కడి నుంచి 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాలి.
దీనిపై ఏప్రిల్‌ 28న యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ స్పందిస్తూ గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలని, లేదంటే సస్పెన్షన్‌ వేటు వేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే, అప్పటి నుంచి పలు కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిసారిగా ఆగస్టు 12వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా దానికి ఒక రోజు ముందు పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్‌ సంఘం భారత సభ్యత్వంపై వేటు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement