Sunday, May 19, 2024

ఆర్ధిక పథకాల్లో పెరుగుతున్న పొదుపు.. జీడీపీలో 74 శాతానికి ఆస్తుల నిర్వహణ

దేశంలో ఆర్ధిక పథకాల్లో పొదపు చేయడం పెరుగుతుందని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. రానున్న నాలుగు సంవత్సరాల్లో అంటే 2026-27 నాటికి ఆర్ధిక పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ జీడీపీలో 74 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. 2021-22లో అన్ని ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ 135 లక్షల కోట్లుగా ఉంది. 2026-27 నాటికి ఇవి 315 లక్షల కోట్లకు చేరుకుంటాయని క్రిసిల్‌ తన నివేదికలో తెలిపింది. దీర్ఘకాలంలో ఆర్ధిక పథకాల్లో పొదుపు మొత్తాలు పెరగాలని కూడా విధాన రూపకర్తలు కోరుకుంటున్నారని తెలిపింది. బంగారం, స్థిరాస్తులు లాంటి భౌతిక ఆస్తుల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌, ఈక్విటీల్లోకి పొదుపు మొత్తాలు మళ్లాలని భావిస్తున్నాయని పేర్కొంది.

గత ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో పెట్టుబడుల స్వరూపంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌, అనలెటిక్స్‌ హెడ్‌ అశిష్‌ వోరా తెలిపారు. అందరికీ ఆర్ధిక సేవలను దరిచేర్చడం, డిటిలలీకరణ, మధ్యతరగతి ఆదాయాలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాల లాంటివి పరిశ్రమలో పొదుపు మొత్తాలు పెరిగేందుకు కారణం అయ్యాయని నివేదిక వివరించింది. మరింత మందికి ఆర్ధిక పథకాలు చేరువయ్యేలా డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ జిజు వైద్యధరణ్‌ తెలిపారు. వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement