Sunday, April 28, 2024

బీబీనగర్ ఎయిమ్స్‌పై పొంతనలేని సమాధానాలు.. కేంద్రం తీరుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ‘బీబీనగర్ ఎయిమ్స్’ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పొంతన లేని సమాధానాలు ఇస్తోందని కాంగ్రెస్ ఎంపీ (నల్గొండ) ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబుపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంస్థను తెలంగాణలోని బీబీనగర్‍‌లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలోగా నిర్మాణం పూర్తవుతుందని గతంలో 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంలో 2022 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో మళ్లీ ఇదే అంశంపై ప్రశ్నించగా.. 2023 నవంబర్‌ నెలను డెడ్‌లైన్‌గా పేర్కొంది.

2022 జులైలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిర్మాణ పనులు 2025 జనవరి నాటికి పూర్తవుతాయని కేంద్రం చెప్పింది. తాజాగా శుక్రవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే నిర్మాణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయన్న విషయంపై మాత్రం సమాధానంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణంలో చోటుచేసుకున్న జాప్యానికి కారణాలను చెప్పడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలను 10 ఏళ్లలోగా పూర్తిచేయాలని ఉందని, అలాంటి హామీల్లో బీబీనగర్ ఎయిమ్స్ ఒకటని ఉత్తమ్ గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన సమాధానాల్లో బీబీనగర్ ఎయిమ్స్ భవనాల నిర్మాణం కోసం రూ. 1,028 కోట్లు మంజూరు చేశామని కేంద్రం వెల్లడించిందని, కానీ అందులో కేవలం రూ. 29.28 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఉత్తమ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement