Tuesday, May 7, 2024

Delhi: బీసీ గణన చేయకపోతే భారీ మూల్యం.. బీజేపీకి బీసీ సంఘాల హెచ్చరిక    

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల కులగణన చేయకపోతే బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా బీసీల లెక్క తేల్చాలని 70 కోట్ల మంది అడుగుతుంటే కేంద్ర క్యాబినెట్‌లో బీసీలకు ఇచ్చిన పదవుల లెక్క చెప్తున్నారని విమర్శించారు. వెనుకబడిన వర్గాలు అడిగేది కేంద్ర కేబినెట్‌లో మంత్రుల లెక్కలు కాదు – బీసీ జనాభా లెక్కలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది బీసీలు మహాధర్నా నిర్వహించారు. మహా ధర్నా అనంతరం ఉద్యమకారులు పార్లమెంట్ ముట్టడికి ర్యాలీగా బయల్దేరడంతో ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో వారు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్, బీ మస్తాన్‌రావు, మాజీ ఎంపీ వీహెచ్ ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ యాదవ్, తెలంగాణ యువజన అధ్యక్షులు కనకాల శ్యామ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్‌రావు, మాజీ ఓబీసీ పార్లమెంట్ ఫోరం అధ్యక్షులు హనుమంతరావు వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు గొంతెత్తారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాలకు లక్ష కోట్ల కేటాయింపు, న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు సాధించే వరకూ తమ ఉద్యమాన్ని ఉధృతంగా చేపడతామని వారు తేల్చి చెప్పారు.

కేంద్రంతో కొట్లాడతాం
బీసీ డిమాండ్లపై తాము ఎన్నోసార్లు పార్లమెంట్‌లో మాట్లాడుతున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని ఎంపీ భరత్ అన్నారు. ఈ విషయంలో కేంద్రంతో గట్టిగా కొట్డాడతామన్నారు.  గతంలో పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేదన్నారు.

ఆంధ్రలో బీసీలకు ప్రాధాన్యం
వెనుకబడిన వర్గాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేదే లేద ఎంపీ బీద మస్తాన్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 50 శాతం పదవులిస్తూ ఏకంగా చట్టమే చేశారని, అన్ని పథకాల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కాకుండా నిరుపేదలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న సీఎం జగన్ ఎందరికో స్పూర్తి అని కొనియాడారు.

ఉద్యమంతోనే సెగ
బీసీ అయిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నా గానీ వెనుకబడిన వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. తాను పార్లమెంట్‌లో ప్రధానిని కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించగా చూద్దామంటూ వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. పార్టీలకతీతంగా దేశవ్యాప్త ఉద్యమం ఉద్యమం చేస్తేనే కేంద్రానికి సెగ తగులుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement