Monday, April 29, 2024

Delhi: నా ఫోన్ ఇస్తా, ఎవరితో దర్యాప్తు చేయించినా ప‌ర్లేదు.. నన్ను దెబ్బతీయాలని చూడొద్దు: గోరంట్ల‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నకిలీ వీడియోను సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావాతో పాటు చట్టబద్ధంగా అన్ని రకాల చర్యలు చేపడతానని హిందూపురం ఎంపీ (వైఎస్సార్సీపీ) గోరంట్ల మాధవ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం వైరల్ వీడియో నిజమైనది కాదని తేలిపోయిందన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని తెలిపారు.

తన ఫోన్ కూడా ఇస్తానని, చంద్రభాబు నాయుడే స్వయంగా ఎవరితోనైనా దర్యాప్తు జరిపించుకోవచ్చునని సవాల్ విసిరారు. ఇంకా కావాలంటే వారి ఇంటికొచ్చి మరీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఏమీలేని వీడియోను పట్టుకుని కొందరు కంకణం కట్టుకుని ప్రజలను నమ్మించాలన్న ప్రయత్నం చేశారని, వారిని జాతి క్షమించదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌తో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలు, కొన్ని మీడియా సంస్థల అధినేతలు కలిసి తననపై కుట్రపూరితంగా వ్యవహరించారని తీవ్ర పదజాలంతో దూషించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వ్యతిరేకి అని మండిపడ్డారు. వనజాక్షిని కొట్టిన చింతమనేనిపై చంద్రబాబు ఎందుకు చర్యలు చేపట్టలేదో చెప్పాలన్నారు.

ఒకవేళ ఆ వీడియో నకిలీదే అనుకుంటే, నకిలీ వీడియో సృష్టికర్తలు వైఎస్సార్సీపీలో గోరంట్ల మాధవ్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించగా.. ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లను అడగాలని బదులిచ్చారు. ఎందుకు తన వెంట పడుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. నకిలీ వీడియో ద్వారా తనను దెబ్బకొట్టాలని చూశారని, కానీ తాను మానసికంగా, శారీరకంగా ధృడమైన వ్యక్తినని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బెదిరేది లేదని మాధవ్ వ్యాఖ్యానించారు. తనను ఇంతగా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినవారికి ప్రజలు చెప్పులతో సమాధానం చెబుతారని అన్నారు. నిజానికి ఈ తరహా నీచ ప్రయత్నాలతో ప్రజల్లో ముఖం చూపలేని పరిస్థితి వారికే తలెత్తిందని మాధవ్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ పార్టీని పైకి లేపడం సాధ్యం కాదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement