Monday, April 29, 2024

Delhi | నాకు నోటీసులు అందలేదు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే రెవెన్యూ, పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లీగల్ నోటీసులు పంపడంపై స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ నుంచి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని ప్రభాకర్ తెలిపారు.

నోటీసులు అందాక సరైన సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకుల నుంచి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షీ బెంజ్‌ కారును అందుకున్నారంటూ ప్రభాకర్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఆమె తరఫున ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని దీపాదాస్ మున్షీ డిమాండ్ చేశారు. అయితే తనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదని ప్రభాకర్ స్పష్టం చేశారు.

తమ పార్టీ పరువు దెబ్బతీసే విధంగా బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేని ఆరోపణలు చేస్తున్న వారు కూడా ఆధారాలు చూపాలని, లేదంటే లీగల్ నోటీసులు అందుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు థాక్రే మీద, టాగోర్ మీద అనేక ఆరోపణలు చేశారన్న ఆయన… నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు సహా అనేక విషయాల్లో వారిపై అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, కార్ల బహుమతులు పరిపాటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలను కచ్చితంగా బయటపెడతానని సవాల్ చేశారు. అవినీతి అక్రమాలు జరగకపోతే ఇంఛార్జిలను ఎందుకు తొలగించారన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement