Sunday, April 28, 2024

Spl story : గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా హైదరాబాద్ !

  • విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా
  • తక్కువ ధరకు కొనుగోలు.. అధిక ధరకు విక్రయాలు
  • కస్టమ్స్‌ అధికారులకు దొరకకుండా అడ్డదారులు
  • విస్తుపోయే చర్యలతో బంగారం రవాణాకు యత్నాలు
  • శంషాబాద్‌లో రూ.కోటి విలువైన బంగారం స్వాధీనం

గోల్డ్‌ స్మగ్లింగ్‌ బిజినెస్‌కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. ఇతర దేశాల నుంచి కొంతమంది కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పుతూ నగరానికి అక్రమ పద్ధతుల్లో బంగారం రవాణా చేస్తున్నారు. ఫలితంగా కస్టమ్స్‌ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంతో నిందితులు పట్టు-బడుతున్నారు. నిందితుల వద్ద పెద్దమొత్తంలో బంగారం లభ్యమవుతోంది. గడిచిన ఆరు నెలల్లో దాదాపు ఐదు వందల గ్రాములకు పైగా అక్రమ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
– ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌

కస్టమ్స్‌ పన్నులు ఎగవేసేందుకు కొంతమంది ఇతర దేశాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి, స్థానిక మార్కెట్‌ ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో అనేక మంది బంగారం స్మగ్లింగ్‌ చేయడంతో పాటు, ఆ బంగారంతో వ్యాపారం సాగించే వారున్నారు. వీరంతా కస్టమర్ల రూపంలో, సొంత అవసరాలకు బంగారాన్ని కొనుగోలు చేశామని చెబుతూ, బంగారాన్ని భారీగా ఇక్కడికి తీసుకు వచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే డీఆర్‌ ఐ అధికారులు కొన్ని సందర్భాల్లో నిర్వహించే తనిఖీల్లో నిందితులు పట్టు బడుతున్నారు.

- Advertisement -

కోటి విలువైన బంగారం స్వాధీనం
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎయిర్‌ ఇం-టె-లిజెన్స్‌ యూనిట్‌ అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోటి విలువైన 1705.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో ఫ్లైట్‌ 6ఈ 1484లో దుబాయ్‌ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా వారి పురుష నాళంలో బ్లాక్‌టేప్‌తో చుట్టి బంగారు పేస్ట్‌తో కూడిన ఆరు క్యాప్సూల్స్‌ దాచిపెట్టినట్లు- గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిరువురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గత వారం కోటికి పైగా విలువైన బంగారం స్వాధీనం
గతవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌ పోర్టులో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్‌ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కడపకు చెందిన ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సి లైట్‌ బ్యాటరీలో సుమారు రూ.1.80 కోట్ల విలువైన బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement