Sunday, May 19, 2024

Delhi | టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి దిగిన వివిధ సంస్థలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ టన్నెల్‌ కుప్పకూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. జాతీయ రహదారిలో భాగంగా నిర్మిస్తున్న ఓ టన్నెల్ నవంబర్ 12న ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో ప్రాణాలతో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.

గత 9 రోజులుగా టన్నెల్‌లో ప్రాణభయంతో గడుపుతున్న కార్మికులకు కంప్రెషన్ కోసం ఏర్పాటు చేసిన 4 ఇంచుల పైప్‌లైన్ ద్వారా నీరు, ఆహారం అందజేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు 6 ఇంచుల బోరింగ్ తవ్వుతున్నామని, మొత్తం 60 మీటర్ల మేర తవ్వాల్సి ఉండగా.. సోమవారం ఉదయం వరకు దాదాపు 40 మీటర్ల మేర తవ్వకం పూర్తయిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. ఇది పూర్తయితే 6 ఇంచుల పైప్‌లైన్ ద్వారా కార్మికులకు డ్రైఫ్రూట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు, డిప్రెషన్‌ను నివారించే మందులు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే లోపల చిక్కుకున్న కార్మికులకు మనోధైర్యాన్ని అందించేందుకు తరచుగా వారితో సంభాషణ కొనసాగుతోందని కూడా వెల్లడించారు.

- Advertisement -

రెస్క్యూ పనులపై ప్రధాని ఆరా

ఉత్తరకాశీ సమీపంలో సిల్క్యారా వద్ద టన్నెల్ కుప్పకూలిన ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందజేస్తోంది. వారం రోజుల వ్యవధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో మూడు సార్లు మాట్లాడారు.  కార్మికుల యోగక్షేమాలు, కొనసాగుతున్న సహాయ చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులకు నీరు, విద్యుత్ సరఫరా అందుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సింగ్ ధామీ ప్రధానికి తెలిపారు. తాను స్వయంగా ఘటనాస్థలాన్ని సందర్శించి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.

రెస్క్యూ పనుల్లో పలు ఏజెన్సీలు

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఇప్పటికే ఐదు సంస్థలు రంగంలోకి దిగగా.. కొత్తగా డీఆర్డీడీవో కూడా సహాయ చర్యల్లో పాల్పంచుకుంటోంది. ప్రస్తుతం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్జేవీఎన్ఎల్), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్), తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్డీసీఎల్) రెస్క్యూ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.

వాటిలో ఎన్‌హెచ్ఐడీసీఎల్ సంస్థ 6 ఇంచుల బోరింగ్ తవ్వే పనుల్లో ఉంది. దీని ద్వారా మరింత అదనపు ఆహారం, మందులు పంపించాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి. మరోవైపు వైద్య బృందాలను టన్నెల్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. నిట్టనిలువుగా ఒక పైప్‌లైన్ ఏర్పాటు చేసి అవసరమైన వస్తువులు పంపించేందుకు ఆర్వీఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ యంత్రపరికరాలను పర్వతం పై భాగం (కార్మికులు చిక్కుకున్న చోట)కు చేర్చేందుకు అవసరమైన అప్రోచ్ రోడ్‌ను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) రికార్డు సమయంలో ఒక్క రోజులోనే పూర్తి చేసింది.

ఆర్మీ ఒక బాక్స్ కల్వర్టును ఏర్పాటు చేసింది. టన్నెల్‌కు మరో చివర నుంచి తవ్వకం పనులను చేపట్టేందుకు టీహెచ్డీసీ భారీ యంత్రపరికరాలను బార్కోట్‌ వైపునకు తరలించింది. వారితో పాటు డీప్ డ్రిల్లింగ్‌లో అనుభవం కలిగిన ఓఎన్జీసీ సైతం బార్కోట్ వైపు నుంచి తవ్వకం జరిపేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే నిట్టనిలువుగా డ్రిల్లింగ్ చేసి చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా పైకి లాగేందుకు సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రయత్నిస్తోంది.

వీటికి తోడు పేలుడు పదార్థాలు, బాంబులను గుర్తించేందుకు తయారు చేసిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్వోవీ) ‘దక్ష్’ను రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఘటనాస్థలానికి చేర్చింది. దీన్ని 100 నుంచి 500 మీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేసే వీలుంది. ఇది నిచ్చెన మాదిరిగా ఎగబాగే సామర్థ్యం కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే మూడు గంటలపాటు విరామం లేకుండా పనిచేయగలదు. దీన్ని రెస్క్యూ ఆపరేషన్‌లో అవసరమైన చోట వినియోగించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement