Sunday, May 5, 2024

భారీగా పెరిగిన నిమ్మ ధరలు.. ఆనందంలో రైతులు ..

అమరావతి, ఆంధ్రప్రభ : రోజురోజుకూ నిమ్మ ధరలు పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గడంతో ఎగుమతులు భారీగా పెరిగాయి. దానికి వేసవి గిరాకీ కూడా తోడవడంతో నమ్మలేని విధంగా నిమ్మ ధరలు పెరిగిపోయాయి. రెండు నెలల కిందట కిలో రూ.15 నుంచి రూ.20 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.130 చేరుకుంది. ఒక దశలో కిలో రూ. 210కు చేరిందంటే నిమ్మ మార్కెట్‌ ఎంత జోరుకుతుందో అర్ధమవుతుంది. ప్రస్తుతం నిమ్మ కాయ యాపిల్‌ ధరలతో పోటీ- పడుతోంది. అమాంతంగా పెరిగిన ధరలతో నిమ్మ రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిమ్మకాయ ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతోంది. రోజు రోజుకూ ధరలు పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో నిమ్మకాయలు యాపిల్‌ ధరతో పోటీ-పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత నెల నుంచి నిమ్మకు ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలలో నిమ్మకాయ నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20 వరకు పలికింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా పెరగడంతో నిమ్మ కాయకు మంచి గిరాకీ ఏర్పడింది. దీనికి తోడు దిగుబడులు తగినంతగా లేవు. ఫలితంగా రేటు- పెరుగుతోంది. నిమ్మకాయ నాణ్యతను బట్టి ఆదివారం మార్కెట్లో పండుకాయ కిలో రూ.100 లు పలకగా.. పచ్చి కాయ కిలో రూ.130 మేర పలికింది. ఈనెల 1వ తేదీ కిలో రూ.80 నుంచి రూ.100 పలికిన నిమ్మకాయలు క్రమంగా పెరుగుతూ ఒక దశలో జైపూర్‌ వ్యాపారుల రంగప్రవేశంతో కిలో రూ.210 వరకూ వెళ్లింది. అయితే, దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 130 నుండి రూ. 180 వరకూ పలుకుతోంది.

రెండు నెలల నుంచి క్రమంగా పెరుగుతున్న ధర..

రెండు నెలల నుంచి నిమ్మకు మంచి గిరాకీ రావడంతో నష్టాల్లో ఉన్న కౌలు రైతులు, నిమ్మ సాగు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నష్టాల నుంచి కోలుకున్నామని రైతులు చెబుతున్నారు. వివిధ జిల్లాల నుండి ప్రతి రోజూ భారీగా నిమ్మకాయలు మినీ భారీలు, ఆటోలు, ట్రాక్టర్లలో మార్కెట్లకు తరలి వస్తున్నాయి. భారీగా నిమ్మ తోటలు సాగు చేసిన రైతులు వ్యాపారులతో మాట్లాడుకుని నేరుగా మద్రాసు, విజయవాడ, తెనాలి, హైదరాబాడు, బెంగళూరు, జైపూర్‌, మహారాష్ట్ర మార్కెట్లకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల నుంచి వర్గాలు అనుకూలించాయి. భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ బోరు బావులకు నీరు చేరింది. దీంతో రైతులు తిరిగి భారీగా తోటలు సాగు చేశారు. మొదట్లో ఉన్న కాయ సమయంలో గిట్టు-బాటు- ధర లేక పోయినా ప్రస్తుతం ధర రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నిమ్మ ధర నాణ్యతను బట్టి కిలో రూ.100 రూ.180 వరకు ఉంది. ధర ఉండడంతో నిమ్మ సాగు రైతుకు మంచి లాభాలు వస్తున్నాయి.

మంచి గిరాకీ..

గతంలో నిమ్మకు ఇంత ధర ఎప్పుడూ రాలేదని నిమ్మ రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది రెండు నెలలగా నిమ్మకాయకు ధర పెరుగుతూ వస్తోందని వారు పేర్కొంటున్నారు. ఈ నెలలో కిలో నిమ్మకాయ నాణ్యతను బట్టి గరిష్టంగా రూ.200 వరకు ధర పలికిందని కొంత మంది చెబుతున్నారు. జైపూర్‌ వ్యాపారుల రాకతో తమకు లాభాలు వచ్చేందుకు మార్గం సుగుమమైందని రైతులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement