Thursday, May 2, 2024

సౌదీ చమురు డిపోపై హౌతీ దాడి.. మిసైల్‌ను ప్రయోగించిన తిరుగుబాటుదారులు

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఒక చమురు డిపోపై హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఫార్ములా 1 గ్రాండ్‌ ప్రిక్స్‌ రేస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఈ దాడి జరిగింది. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్‌ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. జెడ్డా తూర్పు ప్రాంతంలోని బల్క్‌ ఆయిల్‌ డిపోపై ఇటీవలి కాలంలో పలుమార్లు దాడికి పాల్పడిన వీరు శనివారం తెల్లవారుఝామున మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారివారు క్షిపణిని ప్రయోగించడంతో డిపో ధ్వంసమైంది. హౌతీతీవ్రవాదులు చేసిన దాడుల్లో ఇదే అతిపెద్దది. ఫలితంగా అగ్నికీలలు ఎగసి డిపో బూడిదయ్యింది. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయంఉంది. ముస్లింల పవిత్రక్షేత్రం మక్కాకు వెళ్లే యాత్రికులు ఇక్కడి నుంచే ప్రయాణమవుతారు. అయితే, తాజా దాడిలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. కానీ డిపోలోని రెండు ట్యాంక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయని సౌదీ సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి, బ్రిగేడియర్‌ జనరల్‌ టర్కి అల్‌ మల్కీ వెల్లడించారు. సౌదీఅరేబియా చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన ఈ డిపోపై దాడి జరగినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా వెలువడలేదు.

కాగా యెమన్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ హౌతీ వర్గం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోంది. వీరిని నియంత్రించేందుకు యెమన్‌కు సౌదీఅరేబియా సంకీర్ణ దళాలను ఏర్పాటు చేసింది. 2014లో రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోగా మరుసటి ఏడాది సౌదీఅరేబియా అండతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. కాగా తిరుగుబాటుదారులకు ఇరాన్‌ మద్దతిస్తోంది. తమపై దాడికి దిగుతున్న సౌదీపై హౌతీ తిరుగుబాటుదారులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. హౌతీ దాడులను అమెరికా, బ్రిటన్‌ ఖండించాయి. ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తముందని ప్రకటించింది. కాగా షెడ్యూల్‌ ప్రకారమే ఫార్ములా 1 గ్రాండ్స్‌ పిక్స్‌ పోటీలు నిర్వహిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఈ పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. జెడ్డా చమురు డిపో పై తామే దాడికి పాల్పడ్డమని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. గల్ఫ్‌ దేశాల్లో సౌదీకి, ఇరాన్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement