Friday, April 26, 2024

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్.. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపులో సమన్వయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ వాసులను గుర్తించి వారి స్వస్థలాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది. 24 గంటలూ అందుబాటులో ఉండేలా సీనియర్ ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ నేతృత్వంలో ఏర్పాటైన కంట్రోల్ రూం తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. ఇప్పటికే తమకు చాలా ఫోన్లు, మెయిల్స్ వచ్చాయని తెలిపారు.

విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదిస్తూ ఉక్రెయిన్‌లో తాజా స్థితిగతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామని, విద్యార్థుల డాటాను సేకరించి అటు విదేశాంగ శాఖ అధికారులకు అందజేస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ వివరించారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసేసినందున వారిని నేరుగా భారత్ తరలించే పరిస్థితి లేదని, అయితే ఉక్రెయిన్ పశ్చిమ, దక్షిణ సరిహద్దుల్లోని రొమేనియా, హంగేరి, స్లోవాక్ రిపబ్లిక్, పోలండ్ దేశాల ద్వారా తరలించేందుకు సైతం విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది సరిహద్దుల్లోని చెక్‌పోస్టులకు చేరుకున్నారని, ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సంబంధిత చెక్ పోస్టులకు చేరుకుంటే, వారికి ఆయా దేశాల్లోకి ప్రవేశం కల్పిస్తారని వివరించారు. ఈ క్రమంలో కీవ్‌ (ఉక్రెయిన్)లోని భారత రాయబార కార్యాలయంతో పాటు బుడాపెస్ట్ (హంగేరి) రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలు, సూచనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, తెలంగాణ విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు

  1. విక్రమ్ సింగ్ మాన్, IPS – 7042566955.
  2. చక్రవర్తి – పీఆర్వో తెలంగాణ భవన్ – 9949351270.
  3. కె. నితిన్ – ఓఎస్డీ -9654663661
Advertisement

తాజా వార్తలు

Advertisement